Cyber criminals: లింక్ పంపించారు.. ఖాతాను ఖాళీ చేశారు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:14 AM
Cyber criminals:జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు.
- సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్ బ్యాంకు ఉద్యోగి
- రూ.2.49లక్షలు కాజేసిన వైనం
శ్రీకాకుళం క్రైం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా, వీరి ఉచ్చులో పడి ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మోసపోయాడు. సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్‌కు ఓ లింక్‌ను పంపించి అతని బ్యాంకు ఖాతాను ఊడ్చేశారు. నగరంలోని అరసవల్లి సచివాలయం వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్ మొబైల్‌కు ఈ నెల 11వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఓ కాల్ వచ్చింది. ‘యూనియన్ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ యూపీఐ ఆగిపోయిందని, లింక్ పంపిస్తామని దానిని క్లిక్ చేసుకొని సరిచేసుకోవాలి.’ అని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. నిజమే అనుకున్న జయశంకర్ సైబర్ నేరగాళ్లు పంపిన లింకును క్లిక్ చేశాడు. దీంతో జయశంకర్ మొబైల్ ఫోన్‌కు అనుసంధానంగా ఉన్న యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.2.13లక్షలు, అతని భార్య పుష్పలత బ్యాంకు అకౌంట్ ఖాతా నుంచి రూ.36 వేలు నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. మరుసటి రోజు ఉదయం జయశంకర్ తన యూపీఐ యాప్‌ను చెక్ చేయగా తమ ఖాతాల్లో సొమ్ము లేకపోవడంతో ఖంగుతిన్నాడు. ఈ నెల 12న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వారు అకౌంట్ నెంబర్లను పరిశీలించి బుధవారం కేసు నమోదు చేసేందుకు శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసులకు అందించారు. ఈ మేరకు జయశంకర్ నుంచి ఫిర్యాదు అందుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ జగన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.