విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:23 AM
జింకిభద్ర గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ లైన్‌మెన్ నాతి ధర్మారావు(25) పట్టణంలో విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
సోంపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జింకిభద్ర గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ లైన్‌మెన్ నాతి ధర్మారావు(25) పట్టణంలో విద్యుదాఘాతంతో మృతిచెందాడు. రోజువారీ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ని స్తంభం వద్ద చేంజ్ ఓవర్ మారుస్తుండగా షాక్‌కు గురయ్యాడు. చికిత్స కోసం స్థానికులు, కుటుంబ సభ్యులు స్పందించి చికిత్స కోసం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందరితో కలివిడిగా ఉంటూ సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ధర్మారావు మృతిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కుటుంబానికి దిక్కెవరు.
ధర్మారావు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ స్వగ్రామం జింకిభద్రలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. తండ్రి పదేళ్ల కిందటే మృతిచెందారు. తల్లి గున్నమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఉన్నత చదువు చదువుతున్న చెల్లెలు సరస్వతికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ధర్మారావు మృతితో కుటుంబం దిక్కులేనిదైంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ధర్మారావు కుటుంబాన్ని ఎంపీపీ నిమ్మన దాసు పరామర్శించారు.