Share News

నేరడి బ్యారేజీకి లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:20 AM

భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది.

  నేరడి బ్యారేజీకి లైన్‌ క్లియర్‌
నేరడి బ్యారేజీని నిర్మించనున్న ప్రాంతం ఇదే

- వంశధారపై నిర్మాణానికి ట్రిబ్యునల్‌ అనుమతి

- గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర జలశక్తి శాఖ

- ఆనందంలో జిల్లా రైతాంగం

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జల వివాదంలో రాష్ట్రానికి.. ముఖ్యంగా జిల్లా రైతాంగానికి భారీ ఊరట లభించింది. వంశధార నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌ (వీడబ్ల్యుడీటీ) ఇచ్చిన తుది తీర్పును అమలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెల 30న తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ గెజిట్‌ ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్‌ స్పష్టమైన అనుమతిని ఇచ్చింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ల (ఎస్‌ఎల్‌పీ) తుది తీర్పునకు లోబడి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం అవుతుంది.

గెజిట్‌లోని ముఖ్యాంశాలు..

  • గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నది నీటి లభ్యతను 115 టీఎంసీలుగా ట్రిబ్యునల్‌ ఖరారు చేసింది. ఈ జలాలను ఏపీ, ఒడిశా రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టం చేసింది.

  • వంశధార నదిపై నేరడి బ్యారేజీని అనుబంధ నిర్మాణాలతో సహా నిర్మించుకోవడానికి రాష్ట్రానికి అనుమతి లభించింది. ఏపీ అవసరాలు తీర్చడానికి 8వేల క్యూసెక్కుల డిజైన్‌ సామర్థ్యంతో కుడి కాలువ (రైట్‌ హెడ్‌ స్లూయిస్‌) నిర్మిస్తారు. ఒడిశా అవసరాల కోసం ఎడమ వైపు కాలువ (లెఫ్ట్‌ హెడ్‌ స్లూయిస్‌) కూడా నిర్మిస్తారు. ఎడమ వైపు కాలువ నిర్మాణ ఖర్చును ఒడిశా భరించాలి.

  • నేరడి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒడిశా ప్రభుత్వం తమ భూభాగంలో 106 ఎకరాల భూమిని సేకరించి, గెజిట్‌ ప్రచురితమైన తేదీ నుంచి ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చు, పరిహారం తదితర పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఒడిశాకు చెల్లించాలి.

  • కాట్రగడ వద్ద నిర్మించిన సైడ్‌ వియర్‌ ద్వారా ప్రతి ఏటా జూన్‌ 1 నుంచి నవంబరు 30 వరకు ఏపీ 8 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుమతి లభించింది. 8 టీఎంసీల డ్రావల్‌ పూర్తయిన వెంటనే, లేదా డిసెంబర్‌ 1 నాటికి సైడ్‌ వియర్‌ గేట్లను మూసివేయాలి.

  • నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వచ్చిన వెంటనే కాట్రగడ వద్ద ఉన్న సైడ్‌ వియర్‌ను పూర్తిగా మూసివేసి, శాశ్వతంగా నిరుపయోగంగా మార్చేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

  • ఒడిశా లేవనెత్తిన ప్రధాన అభ్యంతరమైన ‘106 ఎకరాల ముపు’ వాదనపై ట్రిబ్యునల్‌ స్పష్టత ఇచ్చింది. ఒడిశా సేకరించాల్సిన 106 ఎకరాల భూమి నది ఎడమ వైపున రక్షణ గోడ, తనిఖీ మార్గం, క్యాచ్‌ డ్రైన్‌ తదితరాల నిర్మాణానికి మాత్రమేనని, ఇది ముంపు ప్రాంత విస్తరణ కాదని తేల్చిచెప్పింది. 3.8 కిలోమీటర్ల పొడవైన రక్షణ గోడ నిర్మించిన తర్వాత, బ్యాక్‌ వాటర్‌ ప్రభావం కేవలం ఆ రక్షణ గోడ నుంచి 3 కిలోమీటర్ల వరకే పరిమితం అవుతుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. ముంపు ప్రాంతం నది మార్గంలోనే ఉంటుందని పేర్కొంది.

  • జల సంవత్సరాన్ని జూన్‌ 1 నుంచి మరుసటి ఏడాది మే 31 వరకు పరిగణిస్తారు. ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నీటిని పంచుకోవాలి. ఒకవేళ నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా (కరువు పరిస్థితుల్లో), లేదా నీటి లభ్యత పెరిగినా అదే దామాషా పద్ధతిలో నీటి వాటాను తగ్గించడం లేదా పెంచడం జరుగుతుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.

పర్యవేక్షణకు కమిటీ

ట్రిబ్యునల్‌ నిర్ణయాలను అమలు చేయడానికి, నేరడి బ్యారేజీ, కాట్రగడ సైడ్‌ వియర్‌ పనితీరును పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యుసీ) నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు, ఒడిశా నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ కార్యాలయ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలకయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పర్యవేక్షక కమిటీ నిర్ణయాలపై అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో సింగిల్‌ మెంబర్‌ ‘రివ్యూ అథారిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫారసు ఆధారంగా నేరడి బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ వల్ల ఒడిశాలో ఏదైనా నష్టం జరిగితే ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌తో జిల్లా రైతుల దశాబ్దాల కలకు చట్టబద్ధమైన ముందడుగు పడినట్లయింది.

Updated Date - Apr 02 , 2026 | 12:20 AM