పసిడి రుణాలపై పరిమితి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:31 AM
How much gold you collect.. it will only be Rs. 2.20 lakhs. బంగారం ఆభరణాలు తనఖా పట్టి.. ఇచ్చే రుణాలపై వాణిజ్య బ్యాంకులు పరిమితి విధించడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల వరకు ఎంత బంగారం కుదువ పెట్టినా.. దానికి తగ్గట్టు రుణాలు ఇచ్చేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆర్బీఐ నిబంధనలు మార్చింది.
ఎంత బంగారం కుదువపెట్టినా రూ.2.20 లక్షలు మాత్రమే
ఎక్కువ డబ్బులు కావాలంటే ఆదాయ వివరాలు, రుణం తీర్చే విధానంపై డిక్లరేషన్
గుదిబండగా మారిన ఆర్‌బీఐ నిబంధనలు
నరసన్నపేట, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి):
జలుమూరు మండలం కూర్మనాథపురం గ్రామానికి చెందిన చల్ల రమణయ్య భూమి కోనుగోలు నిమిత్తం డబ్బులు అవసరమై ఇటీవల ఓ బ్యాంకుకు వెళ్లాడు. తన వద్ద ఉన్న 8 తులాల బంగారం ఆభరణాలు కుదువపెట్టుకుని.. రూ.7లక్షల రుణం కావాలని అడిగాడు. కాగా.. ఎంత బంగారం కుదవపెట్టినా రూ.2.20 లక్షలు మాత్రమే ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆర్బీఐ నిబంధనలు మారాయని, ఇంకా ఏదైనా గ్యారంటీ ఇవ్వాలని అడిగారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత ఆ పత్రాలు ఇస్తానని రమణయ్య చెప్పినా.. అలా కుదరదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.
నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన ఒక ఆసామి ఇల్లు కట్టుకునేందుకు తన దగ్గర ఉన్న 10 తులాల బంగారం బ్యాంకులో కుదవపెట్టేందుకు వెళ్లాడు. రుణాలపై పరిమితి విధించారని బంగారు ఆభరణాలపై భారీస్థాయిలో రుణాలు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో ఆ ఆసామి ఓ ప్రైవేటు సంస్థలో బంగారు ఆభరణాలు కుదవపెట్టి రూ.10లక్షల రుణం తీసుకున్నాడు.
బంగారం ఆభరణాలు తనఖా పట్టి.. ఇచ్చే రుణాలపై వాణిజ్య బ్యాంకులు పరిమితి విధించడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల వరకు ఎంత బంగారం కుదువ పెట్టినా.. దానికి తగ్గట్టు రుణాలు ఇచ్చేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆర్బీఐ నిబంధనలు మార్చింది. బంగారంపై రుణాలు రూ.2.20 లక్షలు మాత్రమే ఇవ్వాలని పరిమితి విధించింది. రూ.2.20 లక్షలకు రుణం మించితే పలు షరతులు పెట్టింది. రుణదారులు ఆదాయ వివరాలు, అప్పును ఎలా తీరుస్తామన్న దానిపై వ్యక్తిగత ధ్రువపత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేసింది. చిరు వ్యాపారులైతే ఆదాయపన్ను రిటర్న్స్, జీఎస్టీ సర్టిఫికెట్ సమర్పించాలి. ఉద్యోగులైతే శాలరీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇదే విషయాన్ని బ్యాంకర్లు చెబుతుండడంతో వివిధ అవసరాల నిమిత్తం బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి.. రుణాలు తీసుకునే రైతులు, చిరువ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో ఏటా సుమారు 3 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. వీటిలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు దాదాపు 60 శాతం ఉన్నాయి. వ్యవసాయ పెట్టుబడులతోపాటు కొత్త ఇళ్ల నిర్మాణం, వ్యాపారాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహ ఖర్చులు, తదితర అవసరాల కోసం చాలామంది తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. మార్కెట్‌లో బంగారం ధర.. ఆర్‌బీఐ నిబంధనల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తుంటారు. తాకట్టుపెట్టే బంగారంపై రుణాల పరిమితి ఉండేది కాదు. కాగా.. కొంతకాలంగా బంగారం ధరల్లో అనూహ్యమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో పసిడి ఆభరణాల తాకట్టుపెట్టుకొని బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీంతో రానున్న ఖరీఫ్‌లో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ ఉండాలని కొన్ని బ్యాంకుల్లో అధికారులు చెబుతుండడంతో బంగారం ఆభరణాలపై రుణాలు ఎండమావిగా మిగిలాయని పేర్కొంటున్నారు. అలాగే ఆర్బీఐ నిబంధనల మేరకు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవడానికి ఆదాయ ధ్రువపత్రం సమర్పిస్తే.. తెల్లరేషన్ కార్డు, ఇతర రాయితీలు పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. దీంతో రుణాల కోసం చాలామంది ప్రైవేటు ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఆ ప్రైవేటు సంస్థలు దుకాణం మూసేస్తే తమ పరిస్థితి ఏంటని.. మరికొందరు సతమతమవుతున్నారు.