Share News

సిక్కోలుకు వలసొచ్చేలా..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:12 AM

Vizag-Brahmapur train halting begins at Tilaru ‘రైల్వే, పోర్టు, జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చేస్తాం. ఒకప్పుడు వలస జిల్లాగా పేరున్న సిక్కోలును.. ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి జనం ఇక్కడకు వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామ’ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు.

సిక్కోలుకు వలసొచ్చేలా..
తిలారులో బ్రహ్మపూర్‌- విశాఖ ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌ సేవలను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, పక్కన మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే రమణమూర్తి తదితరులు

  • రైల్వే, పోర్టు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలతో అభివృద్ధి చేస్తాం

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • తిలారులో వైజాగ్‌-బ్రహ్మపూర్‌ రైలు హాల్టింగ్‌ ప్రారంభం

  • శ్రీకాకుళం/ జలుమూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘రైల్వే, పోర్టు, జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చేస్తాం. ఒకప్పుడు వలస జిల్లాగా పేరున్న సిక్కోలును.. ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి జనం ఇక్కడకు వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామ’ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు. శనివారం జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్‌లో బ్రహ్మపూర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌(18525/18526) హాల్టింగ్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైల్వే అధికారులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాకు అదనపు హాల్టులు మంజూరు చేసిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో కనెక్టివిటీని పెంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే మూలపేట పోర్టు పనులు జరుగుతున్నాయి. జిల్లాలో విమానాశ్రాయ నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు వేస్తున్నాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో సిక్కోలును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. దూసి నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి స్టేషన్‌లోనూ ఎర్రన్న వేసిన అభివృద్ధి ముద్ర కనిపిస్తుంది. ఆయన ఆశయ సాధనకు నేను, బాబాయ్‌ అచ్చెన్న అహర్నిశలు శ్రమిస్తున్నామ’ని తెలిపారు.

  • సమస్యల పరిష్కారానికి హామీ

  • ‘తిలారు స్టేషన్‌ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించాం. ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు, కొత్త భవనం, అప్రోచ్‌ రోడ్డు, అదనపు షాపులు ఏర్పాటు చేసి స్టేషన్‌ను మరింత సుందరంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం. హరిశ్చంద్రపురం.. ఉత్తరాంధ్రలోనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏకైక రైల్వే స్టేషన్‌. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని హాల్టుల కోసం కృషి చేస్తున్నాం. కోటబొమ్మాళిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌ మంజూరు చేస్తాం. వర్షాకాలంలో అండర్‌ పాసేజ్‌ల వద్ద ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు.

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైల్వే పరంగా జిల్లా అభివృద్ధికి రామ్మోహన్‌ విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. ఎర్రన్న బాటలోనే నడుస్తూ కొత్త రైళ్లు, హాల్టులు తీసుకువస్తున్నారన్నారు. కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, తిలారు స్టేషన్లను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అండర్‌ పాసేజ్‌ల వద్ద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం లలిత్‌ బొహరా, సీనియర్‌ డీసీఎం పవన్‌కుమార్‌, నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:12 AM