నాట్లు వేస్తుండగా పిడుగు
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:29 PM
మందస మండలం ఏజెన్సీ ప్రాంతమైన బుడార్సింగి పంచాయతీ పాతకోట, పెడంగోలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
- ఇద్దరు గిరిజన మహిళలు దుర్మరణం
- నలుగురికి తీవ్ర గాయాలు
- పాతకోట, పెడంగోలో విషాదం
హరిపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మందస మండలం ఏజెన్సీ ప్రాంతమైన బుడార్సింగి పంచాయతీ పాతకోట, పెడంగోలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో వరి నాట్లు వేస్తున్న మహిళలపై పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. పాతకోట, పెడంగో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వరి పంటకు వర్షాధారమే ప్రధాన నీటి వనరు. రెండు గ్రామాలూ కళింగదల్ రిజర్వాయర్‌కు ఎగువ భాగంలో ఉంటాయి. ఆదివారం సాయంత్రం కళింగదల్ ఆయకట్టులో నీటికోసం చెలమల్లో ఇంజిన్లు వేసి దమ్ములు చేశారు. అనంతరం పొలంలో ఆరుగురు మహిళలు నాట్లు వేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లు కురిసింది. మరో అరగంటలో ఇంటికి వెళ్లిపోతామన్న సమయంలో వారిపై రెండు పిడుగు పడింది. దీంతో పాతకోటకు చెందిన కట్ట సోముద్రి(45), సవర జోరా(44) అక్కడికక్కడే మృతి చెందగా, ఇదే గ్రామానికి చెందిన బుయ్యా పోరోమి, కుమార్ నీలావతి, పెడంగోకు చెందిన మజ్జి దేవకి, కట్ట సుస్మిత తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వావానంలో హరిపురం ఆసుపత్రికి తరలించారు. మృతులు సోముద్రికి భర్త ఇద్దరు పిల్లలు, జోరాకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. మందస పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.