ఎత్తిపోతలు.. ఎదురుచూపులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:35 PM
Lift irrigation.. Unfinished జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలనా అనుమతి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పరిపాలన అనుమతులు రాక గత ఎనిమిదేళ్ల నుంచి 8 ఎత్తిపోతలు పథకాల పనులు నిలిచిపోయాయి.
పరిపాలనా అనుమతుల కోసం నిరీక్షణ
పనులు పూర్తికాక అవస్థలు
మెళియాపుట్టి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలంలోని కొసమాళ, వసుంధర, రట్టిణి, నడసందర గ్రామాల్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తీర్చేలా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహేంద్రతనయ నదిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని భావించారు. సుమారు నాలుగు పథకాలకు సంబంధించి 1,383 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు 2018లో సర్వే చేసి.. అంచనాలు సైతం సిద్ధం చేశారు. కానీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారి.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళికలు బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించింది. వీటిద్వారా సాగునీరందించేలా నిధులు మంజూరు చేస్తుండడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దీనిపై పరిపాలనా అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
టెక్కలిలో రైతులకు సంబంధించి వంశధార కాలువపై ఆదిఆంధ్రా కాలనీ వద్ద ఎత్తిపోతలు పథకం నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. రూ.858 లక్షల అంచనాలతో సుమారు 576 ఎకరాలుకు సాగునీరు అందివ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటికి పరిపాలనా అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
.. ఇలా జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలనా అనుమతి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పరిపాలన అనుమతులు రాక గత ఎనిమిదేళ్ల నుంచి 8 ఎత్తిపోతలు పథకాల పనులు నిలిచిపోయాయి. 11,037 ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.5562.23 లక్షలతో 8 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. ఏళ్ల తరబడి పనులు ప్రారంభించని కారణంగా గతంలో వీటిని రద్దు చేశారు. మళ్లీ వీటికి పరిపాలనా అనుమతి కోసం కూటమి ప్రభుత్వానికి పంపినట్టు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు పాతపట్నంలోని సీది, పొందూరు మండలంలోని లోలుగు, తోలాపితోపాటు సింగూరు పురం, కొరగాం, తిమ్మాపురం తదితర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 41 ఎత్తిపోతల పథకాల ద్వారా 37,255 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కోసం పైసా కూడా నిధులు ఖర్చు చేయలేదు. ఎత్తిపోతల పథకాలకు కనీస నిర్వహణ కూడా చేపట్టలేదు. పలుచోట్ల మోటార్లకు సంబంధించి రాగిని దొంగలు పట్టుకుపోవడంతో మూడేళ్లపాటు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వ్యవసాయశాఖ మంత్రి చొరవతో ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వాటి ద్వారా పనులు చేపట్టి.. సాగునీటి ఇబ్బందులు తీర్చారు. సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకంతోపాటు గార మండలం కళింగపట్నం, పొందూరు మండలం తండ్యాం తదితర ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేశారు. వీటిపనులు చివరి దశలో ఉన్నాయి. అలాగే కొత్త ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పరిపాలన అనుమతులు కూడా మంజూరైతే.. తమకు సాగునీటి కష్టాలు తప్పనున్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.