కిరాతక భర్తకు యావజ్జీవం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:20 AM
Court verdict in wife murder case భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్తకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోంపేటలోని ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి కోడూరు కిశోర్ బాబు గురువారం తుది తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నాటు తుపాకీతో భార్య హత్య కేసులో కోర్టు తీర్పు
ఆయుధ చట్టం కింద అదనంగా ఏడేళ్ల కఠిన కారాగారం
తీర్పు వెలువరించిన సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు
శ్రీకాకుళం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్తకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోంపేటలోని ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి కోడూరు కిశోర్ బాబు గురువారం తుది తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...
మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర జగ్గారావు(45), సవర పద్మ(33) భార్యాభర్తలు. భార్య ప్రవర్తనపై జగ్గారావు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2021 అక్టోబరు 16న సాయంత్రం పద్మతో గొడవకు దిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. వన్యప్రాణుల వేటకు ఉపయోగించే నాటు తుపాకీతో ఆమె ఛాతీపై సమీపం నుంచి కాల్చాడు. దీంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తుపాకీ పేలుడు శబ్దం విని ఇంట్లోకి వచ్చిన కుమారుడు జగదీశ్.. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని, చేతిలో తుపాకీతో ఉన్న తండ్రిని చూసి భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే బయటకు పరుగులు తీసి తన మామయ్య సవర నరసింహులుకు చెప్పాడు.
నేరం రుజువు కావడంతో..
హతురాలి సోదరుడు నరసింహలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు జగ్గారావుపై ఐసీపీ 302, 498-ఏ సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఆర్ రవిప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) దువ్వు జగన్నాయకులు కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడు జగ్గారావుపై నేరం రుజువు కావడంతో.. ఐపీసీ 302 కింద జీవిత ఖైదు, రూ. 1,000 జరిమానా, అలాగే ఆయుధ చట్టం (సెక్షన్ 25, 27) కింద మరో 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1,000 జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు.
అధికారులకు ఎస్పీ అభినందన
పక్కా దర్యాప్తుతో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐ రవిప్రసాద్, ఏపీపీ జగన్నాయకులు, ఇతర పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.