ఇక జీవితఽఖైదు తప్పదని..
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:57 PM
Accused commits suicide రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడు.. పలాస మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మడియా రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మెడకు ఉరేసుకున్నాడు.
రెండు హత్యకేసుల నిందితుడు ఆత్మహత్య
పలాస, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడు.. పలాస మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మడియా రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మెడకు ఉరేసుకున్నాడు. దీనికి సంబంధించి కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్‌వీఆర్.నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మందస, బారువ పోలీస్టేషన్ పరిధిలో 15 రోజుల వ్యవధిలో ఇద్దర్ని దారుణంగా హతమార్చి మడియా రామారావు పోలీసులకు చిక్కాడు. గతేడాది పాలవలస వద్ద ఆర్మీ జవానును తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హతమార్చాడు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు డబ్బులు డిమాండ్ చేస్తుందని భావించి చంపేశాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు గుర్తించి రామారావును అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో నెల రోజుల కిందట ఆయన కండీషన్ బెయిల్‌పై స్వగ్రామం మహదేవపురం వచ్చాడు. బుధవారం దీనికి సంబంధించి బెయిల్ వ్యవధి పూర్తవుతుంది. పూచీకత్తులు సమర్పించి మరోసారి బెయిల్ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే పూచీకత్తులు ఇచ్చేందుకు ఎవరూ అంగీకారం తెలియజేయపోవడంతో తనకు మళ్లీ జైలు, చేసిన నేరానికి జీవితఖైదు తప్పదని భావించాడు. వారం రోజుల నుంచి భార్య ప్రమీలతో కూడా తగాదా పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రమీల జీడి పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లగా.. ఇంటిలో ఎవరూ లేని సమయం చూసుకొని రామారావు ఉరేసుకున్నాడు. దీంతో భార్య, ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులు విలపించారు. ప్రమీల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.