Share News

తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడికి యావజ్జీవం

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:25 PM

తల్లిదండ్రుల హత్య కేసులో కుమా రుడు బూసి శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు.

 తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడికి యావజ్జీవం

పాతపట్నం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల హత్య కేసులో కుమా రుడు బూసి శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మేజర్‌ పంచాయతీ పాతపట్నం పరిధిలోని కాపుగోపాలపురానికి చెందిన బూసి శ్రీనివాసరావుకు భార్య కల్యాణి, వృద్ధులైన తల్లిదండ్రులు రామారావు, భాగవతమ్మ ఉన్నారు. శ్రీనివాసరావు దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతుండేవి. ఈ విషయంలో ఆయన తల్లిదండ్రులు తరచూ జోక్యం చేసుకుంటూ కోడలు కల్యాణికి వత్తాసు పలుకుతుండేవారు. ఈ అక్కసుతో 2022 జూన్‌ 7వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో తల్లిదండ్రులతో గొడవపడి వారిపై కత్తి, దుడ్డుకర్రతో దాడి చేశాడు. దీంతో తల్లి భాగవతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తండ్రి రామారావు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరుసటి రోజు ఉదయం మృతిచెందాడు. మృతుల చిన్నకోడలు బృందారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సర్కిల్‌ ఇనస్పెక్ట్టర్‌ ఎం.వినోద్‌బాబు కేసు నమోదు చేసి శ్రీనివాసరావును అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌ దాఖలుచేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దువ్వు జగన్నాయకులు వాదనలు వినిపించగా ముద్దాయిపై అభియోగాలు రుజువైనందున 6వ అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు.. శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగారా శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సోమవారు తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడునెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 11:25 PM