పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షిద్దాం
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:26 AM
పిల్లల్లో నులిపురుగులను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత పిలుపునిచ్చారు.
- ఈ నెల 17న డీవార్మింగ్ డే
- 4.27లక్షల మందికి మాత్రలు వేస్తాం
- జిల్లా వైద్యారోగ్యశాఖ అఽధికారి అనిత
అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పిల్లల్లో నులిపురుగులను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత పిలుపునిచ్చారు. ఈ నెల 17న డీవార్మింగ్ డే పురస్కరించుకుని తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1-19 సంవత్సరాల లోపు వయసు గల వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4.27లక్షల మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. రక్తహీనత లేని, ఆరోగ్యకర సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో డీవార్మింగ్ డే నిర్వహిస్తామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాదరక్షలు ధరించడం, పరిశుభ్రమైన తాగునీరు, ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో నులిపురుగుల బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. కార్యక్రమంలో డీఐవో డా.రాందాస్, డాక్టర్ శివరంజని, డాక్టర్ బి.రవీంద్ర, డి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.