Share News

క్షయను నిర్మూలిద్దాం

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:06 AM

క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కె.అనిత పిలుపునిచ్చారు.

క్షయను నిర్మూలిద్దాం
ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది

- ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం

- జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అనిత

అరసవల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కె.అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు మంగళవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్‌ మిషన్లు ఉన్నాయని తెలిపారు. 77 పంచాయతీల్లో వెయ్యి మంది జనాభా ప్రాతిపదికన టీబీ ముక్త్‌ పంచాయతీలుగా, ఒకటి కంటే ఎక్కువ కేసులున్న వాటిని సిల్వర్‌ పంచాయతీలుగా, కేసులు లేని వాటిని గోల్డ్‌ పంచాయతీలుగా నిర్ణయిస్తామన్నారు. క్షయ బారిన పడినవారు క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని అన్నారు. జిల్లాలో 9 యూనిట్లు ఉన్నాయని, ఇప్పటికి 506 మందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. టీబీ ప్రధానంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని, సరైన జాగ్రత్తలతో దీనిని పూర్తిగా నివారించవచ్చన్నారు. వ్యాధి బారిన పడిన వారు సరైన పోషకాహారం, పండ్లు, కూరగాయలు తీసుకుని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా 100 మంది రోగులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం టీబీ నివారణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, టీబీ నివారణాధికారి టి.శ్రీకాంత్‌, వైద్యాధికారులు, రిమ్స్‌, జెమ్స్‌ ఆసుపత్రుల శిక్షణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:06 AM