లాభసాటిగా.. ‘సాగు’దామని..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:17 AM
Support to farmers through the Horticulture Department సాగులో భాగంగా ప్రభుత్వం ఉద్యాన, వ్యవసాయశాఖల ద్వారా రైతులకు వివిధ రకాల ప్రోత్సాహకాలతో తోడ్పాటు కల్పిస్తోంది. ఒకేరకమైన పంటల సాగుతో దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం క్షీణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేర్వేరు పంటలపై అవగాహన కల్పిస్తూ.. రబీ సీజన్‌లో అపరాల సాగుకు సబ్సిడీ అందిస్తోంది.
ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు తోడ్పాటు
జీడి, మామిడి మొక్కలకు 50 శాతం రాయితీ
ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 శాతం సబ్సిడీ
అపరాల సాగుకు వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు
కంచిలి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సాగులో భాగంగా ప్రభుత్వం ఉద్యాన, వ్యవసాయశాఖల ద్వారా రైతులకు వివిధ రకాల ప్రోత్సాహకాలతో తోడ్పాటు కల్పిస్తోంది. ఒకేరకమైన పంటల సాగుతో దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం క్షీణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేర్వేరు పంటలపై అవగాహన కల్పిస్తూ.. రబీ సీజన్‌లో అపరాల సాగుకు సబ్సిడీ అందిస్తోంది. మరోవైపు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్(ఉపాధిహామీ) పథకం ద్వారా ఉద్యానవన, అంతర పంటల సాగుకు సంబంధించి యాంత్రీకరణ పరికరాలను, విత్తనాలను 50శాతం రాయితీపై అందిస్తోంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడదతో వరిసాగు చేసే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పండ్లు, పూలసాగుతోపాటు కొబ్బరి, జీడి, మామిడి తోటల్లో అంతర పంటలుగా బీర, బెండ, పాదుల వంటి కూరగాయల సాగుకి సబ్సిడీపై అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా రైతులను చైతన్యం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్దానంలో పలువురు రైతులు విభిన్న పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
కంచిలి మండలంలో వరి సుమారు 12 వేల ఎకరాల్లో, కొబ్బరి 4,667 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జీడి, మామిడి కలిపి కేవలం 1,620 ఎకరాల్లోనే సాగు జరుగుతోంది. ఈ ఏడాది ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం విత్తనాలు, ముడి వస్తువుల కొనుగోలుతోపాటు యంత్రాలు, ఇతర సౌకర్యాల కల్పనకు 45 నుంచి 50 శాతం రాయితీ అందిస్తున్నారు. కంచిలి, కవిటి ప్రాంతాల్లో రైతులకు జీడి, మామిడి విస్తరణ పథకం ద్వారా ఉద్యానవన శాఖ అధికారులు హెక్టారుకు రూ.12 వేల రాయితీతో మొక్కలను అందజేస్తున్నారు. రైతులు తమకు కావలసిన మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లోనే కొనుగోలు చేయాలి. వీటితోపాటు అత్యధిక లాభాలు అర్జించే పండ్ల రకాలైన డ్రాగన్‌ఫ్రూట్, సపోటా, ఉసిరి మొక్కల కొనుగోలులోను హెక్టారుకు రూ.12 వేల సబ్సిడీని అందిస్తున్నారు. కొబ్బరి, జీడి, మామిడి తోటలలో అంతర పంటలుగా వేసుకునే ఇతర పండ్ల రకాల పెంపకానికి సైతం రాయితీలు కల్పిస్తున్నారు. ఇవే కాకుండా క్యాబేజీ, వంకాయ, బెండకాయ, దొండకాయ వంటి ఇతర కాయగూరల పంటలకు అత్యధికంగా హెక్టారుకు రూ.24 వేల రాయితీ ఇస్తున్నారు. దొండ, ఆనపకాయ, అల్లం, పసుపు ఇతర పాదులకు అవసరమైన పందిర్లు వేసుకునేందుకు సిమెంటు స్తంభాలను సైతం సబ్సిడీపై అందిస్తున్నారు. రైతులు పొలాల్లో శాశ్వత పందిర్లు వేసుకునేందుకు ఎకరాకు సుమారు 180 స్తంభాలు అవసరమవుతాయి. వీటి కోసం సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో ప్రభుత్వం రూ.2లక్షలు సబ్సిడీ అందిస్తుంది.
పూల సాగుకు ప్రత్యేక తోడ్పాటు
పూల సాగు చేసే రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక తోడ్పాటును అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పూల వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. గులాబీ, చామంతి, కనకంబరాలు, మల్లి వంటి పూలసాగుకు హెక్టారుకు రూ.24వేల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. వీటితోపాటు పంటలు పండించిన అనంతరం వాటిని గ్రేడింగ్ చేసుకునేందుకు, డిమాండ్ వచ్చే వరకు, ఇతర ప్రాంతాలకు పంపించే క్రమంలో అవసరమయ్యే గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందజేస్తోంది. చిన్న ప్యాకింగ్ కేంద్రాల నిర్మాణానికి, ప్రొసెసింగ్ యూనిట్‌ల కోసం గరిష్టంగా రూ.4 లక్షల యూనిట్‌కి 45 నుంచి 50 శాతం సబ్సిడీ ఇస్తోంది.
యాంత్రీకరణ ద్వారా భారీ యూనిట్లు
రైతులకు సాగులో యాంత్రీకరణ పేరిట 50శాతం రాయితీలతో పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇది ఐదు ఎకరాలు.. ఆపై భూమి ఉన్న రైతులకే వర్తిస్తుంది. రైతులు సహకార వ్యవసాయం చేస్తూ సహకార సంఘంగా ఏర్పడితే ఒక యూనిట్ యంత్రాలను 50శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. చిన్న ట్రాక్టర్లు, హార్వెస్టర్, ఇతర సాగు పనిముట్లు రాయితీతో ఇస్తున్నారు. దీనికితోడు కొబ్బరి, జీడి, మామిడి పంటలలో అంతర పంటల సాగుకు అవసరమైన స్పింకర్లు, కందకాల తవ్వకం వంటి పనులను ఉపాధి హామీ పథకం సాయంతో రైతులకు అందజేస్తున్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా రాయితీలు
రబీ సీజన్‌లో వరి కాకుండా అపరాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పలు రాయితీలను అందిస్తోంది. కట్టె జనుము 10 కిలోల ప్యాకెట్ రూ.1090 కాగా.. 50 శాతం సబ్సిడీపై రూ.545కే లభిస్తోంది. రాగులు, ఇంద్రావతి, శ్రీ చైతన్య విత్తనాలు కిలో రూ.69 కాగా వీటిపై కూడా 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. పెసలు, ఐపీఎం 2-14 రకం కిలో రూ.135 కాగా సబ్సిడీ రూ.40.50 అందిస్తున్నారు. మినుములు ఐపీయూ 2-43, టీబీజీ - 104, పీయూ 31 రకాలు కిలో రూ.138 కాగా సబ్సిడీ రూ.41.50 చొప్పున ఇస్తున్నారు. నువ్వులు కిలో రూ.155 కాగా సబ్సిడీ కిలోకి రూ.62 అందిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీలు, ఇతర సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పండ్లు, పూల సాగుపై రైతులు దృష్టి సారించాలి. గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం.
- మాధవీలత, ఉద్యానవన శాఖాధికారిణి, కంచిలి