ఆలోచిద్దాం.. బతికి సాధిద్దాం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:21 AM
Today is World Suicide Prevention Day జిల్లాలో ఇటీవల ఎక్కువ యువత బలవనర్మణానికి పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏటా 50 నుంచి 70 మంది వరకూ 15- 25 ఏళ్లలోపు వయసున్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. చదువు ఒత్తిడి భరించలేక.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొంతమంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరు రుణాల బాధ, వ్యక్తిగత కారణాలతో తనువు చాలిస్తున్నారు.
బలవన్మరణాలతో భవిష్యత్ కోల్పోతున్న యువత
క్షణికావేశంలో తనువు చాలిస్తున్న ఘటనలెన్నో
అతిగారాబం.. ఒత్తిడే కారణమంటున్న నిపుణులు
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల ఎక్కువ యువత బలవనర్మణానికి పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏటా 50 నుంచి 70 మంది వరకూ 15- 25 ఏళ్లలోపు వయసున్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తేలింది. చదువు ఒత్తిడి భరించలేక.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొంతమంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరు రుణాల బాధ, వ్యక్తిగత కారణాలతో తనువు చాలిస్తున్నారు.
మరికొందరు సెల్‌ఫోన్ వినియోగం తగ్గించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికినా.. మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడవద్దని.. ఒక్కసారి ఆలోచించి.. బతికి సాధించాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గడిచిన కాలం.. పోయిన ప్రాణం తిరిగి రాదని.. కుటుంబ సభ్యులకు శోకం మిగల్చకుండా.. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు.
ఘటనలెన్నో..
ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతన్న ప్రత్తిపాటి సృజన్ గతేడాది నవంబరు 12న.. ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాక్‌లాగ్స్‌లో 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్ అనే 21 ఏళ్ల యువకుడు కొన్నాళ్ల కిందట ఉపాధి నిమిత్తం అబుదాబి వెళ్లాడు. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఏడాది జూలైలో కొత్తూరు కేజీబీవీలోని ఓ ఇంటర్ విద్యార్థిని.. ‘ఇంగ్లీష్ బోధన అర్థం కావడం లేదని.. సరిగా చదవలేకపోతున్నా’నని తల్లిదండ్రులకు చెప్పింది. ఆపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
కరజాడ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని.. నరసన్నపేటలో ఇంటర్ చదివేది. ఈమె దొంగతననానికి పాల్పడినట్టు కొంతమంది అవమానించడంతో.. ఆత్మహత్యకు పాల్పడింది. ఇటువంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.
ఒత్తిడిని అధిగమించలేక ...
ప్రస్తుతం చాలామంది విద్యార్థులు పాఠశాల, ఇంటికే పరిమితమవుతున్నారు. కనీసం పరిసర ప్రాంతాల్లో కూడా ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు. శారీరక వ్యాయామం లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అలాగే తల్లిదండ్రుల అతిగారాబం చేయడంతో పిల్లలు మరింత సున్నితంగా తయారవుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించినా.. అవమానకరంగా భావించి.. ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు.
పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు తక్కువ రావడం, పోటీపరీక్షల ఒత్తిడి, ఉద్యోగం రాకపోవడం, తల్లిదండ్రుల అంచనాలు వంటి అంశాలు కొందరిలో తీవ్ర ఒత్తిడికి దారితీస్తాయి.
ప్రేమ విఫలం, విడిపోవడం, స్నేహితులతో గొడవలు, అవమానాలకు గురిచేయడం వంటి కారణాలతో కూడా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, చదువు విషయంలో ఇతరలతో పోల్చడం, ఇంట్లో పిల్లలను అర్థం చేసుకునే వాతావారణం లేకపోతే మానసికంగా కుంగిపోతారు. తోటి విద్యార్థుల వేధింపులు కూడా ఆత్మహత్యకు దారితీస్తాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి. ఒంటరితనాన్ని కోరుకుంటారు. సకాలంలో ఆహారం తీసుకోరు. ముభావంగా ఉంటారు. బతికి ఏం లాభమని, చనిపోతే పోతుంది అని ముందుగానే పరోక్షంగా సంకేతాలిస్తారు. ఇటువంటివారిపై కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించి.. కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థి దశ నుంచే నెలకోసారైనా.. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై సమీక్షించాలి. అవసరమైన వారికి నిపుణుల కౌన్సిలింగ్ ఇవ్వాలి. హాస్టళ్లలో ప్రత్యేక పర్యవేక్షణతో పాటు ర్యాగింగ్, వేధింపులు, అవమానాలపై ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఏ సమస్య అయినా ఎదుర్కొనేలా విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపాలని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జీవితం.. ఓ వరం
మనిషికి జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. ఎన్ని సమస్యలు ఎదురైనా.. పోరాడి జీవితాన్ని ఆస్వాదించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మీయలతో మాట్లాడటం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- ఆర్.సురేష్‌కుమార్, ఆర్‌ఐవో, ఇంటర్ విద్య, శ్రీకాకుళం
చావు ముందు.. సమస్య చిన్నదే
మనిషి జీవితానికి ముగింపు చావు. చావు ముందు ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్నదే. క్షణికావేశంతో ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదు. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే.. కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేసినట్లే. ఏదైనా బతికి సాధించాలి.
- విజయభాస్కరరావు, ఆర్జేడీ, పాఠశాలవిద్య, విశాఖపట్నం
బయట ప్రపంచం చూపించాలి
పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బయట ప్రపంచాన్ని పరిచయం చేయాలి. వారంలో రెండు రోజులైనా శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఆటలు ఆడించాలి. మానవతా విలువలను తెలియజేయాలి. చదువుపై ఒత్తిడి చేయకుండా.. వారి అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించాలి.
- బెండి సాయిరాం, మానసిక వైద్యుడు, కేజీహెచ్, విశాఖపట్నం