ఓజోన్ పొరను పరిరక్షించుకుందాం
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:38 AM
Today is the International Day for the Preservation of the Ozone Layer జిల్లాలో వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరిగింది. ఫలితంగా సూర్యుడి ద్వారా వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షించే ఓజోన్ పొర క్షీణిస్తోంది. మానవ మనుగడకే ముప్పువాటిల్లుతోంది. సమస్త జీవరాశులపైనా ఆ ప్రభావం పడుతోంది.
క్షీణిస్తే మానవ మనుగడకే ముప్పు
అన్ని జీవరాశులపైనా తీవ్ర ప్రభావం
నేడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినం
నరసన్నపేట, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరిగింది. ఫలితంగా సూర్యుడి ద్వారా వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షించే ఓజోన్ పొర క్షీణిస్తోంది. మానవ మనుగడకే ముప్పువాటిల్లుతోంది. సమస్త జీవరాశులపైనా ఆ ప్రభావం పడుతోంది. బుధవారం అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినం సందర్భంగా ఓజోన్ ఆవశ్యకత.. జిల్లాలో పరిస్థితుల గురించి తెలుసుకుందాం. భూమిని ఆవరించి ఉన్న వాతావరణ పొరల్లో.. 16 నుంచి 55 కి.మీ. మేర విస్తరించి ఉన్న స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్ ఉంటుంది. భూమి చుట్టూ ఆవరించి ఉండే మొదటి పొర ట్రోపోస్పియర్లోని ఆక్సిజన్ అణువులు రూపాంతరం చెంది స్ట్రాటోస్పియర్లో ఓ3 అణువులుగా మారుతాయి. ఈ ఓ3ని ఓజోన్ వాయువుగా పిలుస్తారు. ఈ అణువలన్నీ ఓజోన్ పొరగా ఏర్పడతాయి. సూర్యుడి నుంచి అచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరకుండా అడ్డుకుంటాయి. భూమిపై ఉన్న జీవరాశులకు నష్టం కలుగకుండా రక్షణ కవచంలా నిలుస్తాయి. అయితే మానవుడి అనాలోచిత చర్యలతో ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్రధాన కారణలివే ...
ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధాన కారణంగా క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ) నిలుస్తున్నాయి. వీటివల్ల మానవాళితోపాటు సమస్త జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతోంది. రిఫ్రిజిరేటర్లు ఏసీలు వంటి వాటిల్లో వినియోగిస్తున్న సీఎఫ్‌సీలు, హైడ్రో సీఎఫ్‌సీలు వాతావరణంలో పేరుకుపోయి... స్ట్రాటోస్పియర్‌లో గల ఓజోన్‌తో చర్య పొంది అణువులను విడగొట్టి ఆక్సిజన్‌లా మారుస్తున్నాయి. ఓ 3 అణువులు ఓ2 వాయువుగా మారుతుండడంతో ఓజోన్ పొర పలుచబడుతోంది. పంటపై చల్లే స్ర్పే, ఫోమ్, డిటర్జెంట్లు, ప్లాస్టిక్ వస్తువుల తయారీ, రిఫ్రిజరేటర్ వంటి వాటి వినియోగంతో క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. బ్రోమిన్ సైతం ఓజోన్ పొరను ఛిద్రం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. నైట్రిక్ ఆక్సైడ్(ఎన్‌వో), టెట్రాక్లోరో మీఽథేన్, మిథైల్ బ్రోమైడ్ (సీసీఎల్ 4, సీహెచ్3 బీఆర్)లను కూడా ఓజోన్ ఈటర్స్‌గా పిలుస్తారు.
అనేక దుష్ఫలితాలు
ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరుతున్నాయి. దీంతో మనుషుల్లో చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్త తగ్గడం, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జంతువులపై ఇవి మరింత తీవ్ర పరిణామాలు చూపుతాయి. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి మొక్కల ఆహారం తయారీలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర జీవజాలంపై పరోక్షంగా ఈ ప్రక్రియ ప్రభావితం చూపిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉష్టోగ్రతలు పెరిగి భూమి అగ్నిగోళంగా మారడం కూడా దీని ప్రభావమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పరిరక్షణకు ఏం చేయాలంటే...
ఏసీలు, రిఫ్రిజరేటర్లను బాధ్యతగా వినియోగించాలి. పాత పరికరాల్లో హానికర శీతలీకరణ వాయువుల లీకేజీలను నివారించాలి. పాతఏసీలు, ఫ్రిజ్‌లను అధీకృత రీసైక్లింగ్ /ఈ-వేస్ట్ కేంద్రాలకు అప్పగించాలి.
ఏరోసోల్ స్ర్పేలు, రసాయన ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగించకూడదు. విద్యుత్ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలి.
ప్రజారవాణా, సైకిల్, నడక, కార్‌పూలింగ్ వంటి ప్రత్యామ్నాయాలను వీలైనంత ఎక్కువగా వినియోగించాలి. మొక్కలను నాటాలి. చెట్లను సంరక్షించాలి.
ఓజోన్ పొర క్షీణతకు సీఎఫ్‌సీఎస్‌లు ప్రధాన కారణం కాబట్టి వీటి వాడకాన్ని నిషేధించాలి. వీటికి బదులుగా హైడ్రోఫ్లోరా ఒలిఫిన్స్ (హెచ్‌ఎఫ్‌వో)లు వాడాలి. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్లలో అమ్మోనియం వాడకాన్ని ప్రోత్సహించాలి.
క్లోరిన్ కలిగిన పురుగు మందుల వాడకాన్ని నిషేధించాలి. జీవ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలి.
అవగాహన పెంచాలి
పర్యావరణ పరిరక్షణకు ఓజోన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓజన్ పొర రక్షణకు పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాలి. సీఎఫ్‌సీ బదులుగా అమ్మోనియం వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు అతిగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపైనా అవగాహన కల్పించాలి.
- రువ్వ తవుడు, భూగోళశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం
జీవరాశులపై ప్రభావం
ఓజోన్ పొర దెబ్బతింటే అతినీలలోహిత కిరణాలు భూమి మీదకు చేరి అనేక జీవరాశులు అంతమయ్యే అవకాశం ఉంది. జన్యుపరమైన లోపాలు ఏర్పడతాయి. ప్రకృతి ధర్మం తప్పుతుంది. మొక్కలు నాటాలి. అటవీ విస్తీర్ణం పెంచాలి.
- సాధు రుద్రమరాణి, లెక్చరర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం