Share News

నిద్రమత్తు వీడండి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:47 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, అధికారులు నిద్రమత్తు వీడాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు.

 నిద్రమత్తు వీడండి
బూరగాం గ్రామసభలో సమస్యలు వింటున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అధికారులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరిక

కంచిలి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, అధికారులు నిద్రమత్తు వీడాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. బూరగాంలో శనివారం సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు అధికారుల పనితీరును ఆయనకు వివరించి అసంతృప్తి వ్యక్తంచేశారు. రీ సర్వే సమయంలో భూముల వివరాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన గేదెల శేఖర్‌ తనకు జాయింట్‌ ఎల్‌పి వచ్చిందని, దీనిపై వీఆర్వోకి దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వీఆర్వో సూర్యనారాయణకు ఎందుకు నోటీసులివ్వలేదని తహసీల్దార్‌ రమేష్‌ కుమార్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. అతను ఇస్తానని బదులివ్వడంతో వీఆర్వోకి నోటీసులు ఇవ్వకుంటే మీకు నోటీసులిస్తానని కలెక్టర్‌ హెచ్చరించారు. పంచాయితీ పరిధిలో ఇన్ని తప్పులు జరుగుతుంటే పని చేయకుండా ఉంటుంటే మీకు నిద్ర పడుతుందా అని వీఆర్వోని కలెక్టర్‌ ప్రశ్నించారు. గ్రామంలో పలు సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. సమావేశంలో పలాస ఆర్డీవో అప్పలరాజు, ఎంపీడీవో వి.తిరుమలరావు, మండల సర్వేయర్‌ శేషగిరిరావు, కూటమి నాయకుడు బొడ్డ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: కలెక్టర్‌

పాఠశాలల్లో ఉచిత పుస్తకాలతోపాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. ఎంఎస్‌పల్లి పాఠశాల హెచ్‌ఎం జి.రాజేంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే అశోక్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలను చేర్పించి, ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని వారు కోరారు. ఎంఈవోలు శివరాం ప్రసాద్‌, చిట్టిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:47 PM