అమ్మో కుష్ఠు వ్యాధి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:56 PM
31 new cases reported in the srikakulam జిల్లాలో కుష్ఠు వ్యాధి భయపెడుతోంది. తాజాగా 31 కొత్త కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 11వ తేదీ నుంచి జిల్లాలో ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో 1329 అనుమానిత లెప్రసీ కేసులను గుర్తించారు. వీటిని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పరీక్షించగా కొత్త కేసుల లెక్కతేలింది.
జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు
ఎల్‌సీడీసీ సర్వేలో గుర్తింపు
ఆందోళన కలిగిస్తున్న ఎంబీ కేసులు
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుష్ఠు వ్యాధి భయపెడుతోంది. తాజాగా 31 కొత్త కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 11వ తేదీ నుంచి జిల్లాలో ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో 1329 అనుమానిత లెప్రసీ కేసులను గుర్తించారు. వీటిని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పరీక్షించగా కొత్త కేసుల లెక్కతేలింది. 1329 అనుమానిత కేసుల్లో 20 పీబీ (పాసిబాసిలరీ) కేసులుగా నిర్ధారణ అయింది. ఇందులో 16మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అలాగే, 11 ఎంబీ (మల్టిపుల్‌బాసిలరీ) కేసులు కూడా నిర్ధారణ అయ్యాయి. వీటిలో తొమ్మిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
నెమ్మదిగా ఆన్‌లైన్ సర్వే
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిలో ఏన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఎల్‌సీడీసీ ఆఫ్‌లైన్ సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. కానీ, ఆన్‌లైన్ సర్వే మాత్రం నెమ్మదిగా సాగుతోంది. ఆఫ్‌లైన్ సర్వేలో భాగంగా ఏన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబంలో ఉన్న వారందరినీ పరిశీలించి అనుమానా స్పద కేసులను గుర్తించారు. అయితే, వీటిని ఏఎన్‌ఎం ఏపీ హెల్త్ యాప్‌లో నమోదు చేయాలి. అవి మెడికల్ ఆఫీసర్ లాగిన్‌లోకి వెళ్తాయి. మెడికల్ ఆఫీసర్ నిర్ధారణ చేస్తే కొత్త కేసులు ఎన్ని అన్నది లెక్క తేలుతుంది. కానీ, ఈ ఆన్‌లైన్ సర్వే ఇంకా పూర్తి కాలేదు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ అభా ఐడీ క్రియేట్‌చేసి తద్వారా అతనికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఆన్‌లైన్ సర్వే పూర్తవుతుంది. దీనికి సమయం పడుతుండడంతో ఆన్‌లైన్ సర్వే నెమ్మదిగా సాగుతోంది.
ఎంబీ కేసులతో ప్రమాదం..
పీబీ కేసులు అంటే తక్కువ స్థాయిలో సూక్ష్మజీవులతో ఉండి శరీరంపై ఐదులోపు మచ్చలు ఉంటాయి. వీరికి ఆరునెలల చికిత్స అవసరమవుతుం ది. ఎంబీ కేసులతోనే సమస్యంతా. పీబీ కేసులకు ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేయించుకోకపోతే, అవి ఎంబీ కేసులుగా మారతాయి. వీరికి ఏడాది పాటు చికిత్స ఉంటుంది. అయితే, శరీరంపై అనుమానాస్పద మచ్చలు ఉన్న వారు పరీక్షలకు ముందుకురాకపోవడం, వైద్య సిబ్బంది కూడా సర్వే రోజుల్లో తప్ప మామూలు రోజుల్లో వారిని పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఈ కేసులు పీబీ నుంచి ఎంబీలకు మారుతున్నాయి. దీంతో ఈ కేసుల్లో నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కు వగా ఉంటుంది. ప్రస్తుతం ఎంబీ కేసులు 11 మాత్రమే బయటపడ్డాయి. ఇంకా వెలుగు చూడనవి ఎన్నో ఉన్నాయి. ఈ కేసుల్లో వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే ఎంబీ కేసు వ్యాధిగ్రస్తుడు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్లద్వారా బ్యాక్టీరియా మరొకరికి వ్యాపిస్తుంది. లెప్రసీ కేసులను గుర్తించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో పాటు పీహెచ్‌సీ సిబ్బంది కూడా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే మరిన్ని కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని, వ్యాధి వ్యాప్తిని తగ్గించడానకి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఆ శాఖలో వ్యక్తమవుతోంది.
31 కొత్త కేసులు గుర్తించాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఉన్న సిబ్బందిని వినియోగించుకొని కొత్త లెప్రసీ కేసులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏఎన్‌ఎంలు, ఆశల ద్వారా చేసట్టిన సర్వేలో 31 కొత్త కేసులు గుర్తించాం.
-డాక్టర్ ప్రవీణ్, డీఎన్‌ఎం