హాస్టల్ నుంచి వెళ్లి చెరువులో శవమై..
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:11 AM
Student dies in pond కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతిగృహంలో ఆరో తరగతి చదువుతున్న ముద్దాడ దుర్గాప్రసాద్ (11).. సమీపంలోని మెండవాని చెరువులో ప్రమాదవశాత్తూ కాలుజారి పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాలుజారి నీటిలో విద్యార్థి పడిఉంటాడని అనుమానం
సమాచారం ఇవ్వలేదంటున్న కుటుంబ సభ్యులు
మంత్రి కె.అచ్చెన్నాయుడు సీరియస్
సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశం
ప్రభుత్వ వసతిగృహంలో ఉన్న ఓ విద్యార్థి చెరువులో శవమై తేలాడు. ఆదివారం సాయంత్రమే బయటకు వెళ్లినా.. రాత్రయినా తిరిగి రాకున్నా.. ఉదయం కనిపించపోయినా.. వసతిగృహం అధికారులకు పట్టలేదు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని విద్యార్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంధువులు హాస్టల్ వద్దకు వస్తేగానీ అసలు విషయం తెలియలేదు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కోటబొమ్మాళి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతిగృహంలో ఆరో తరగతి చదువుతున్న ముద్దాడ దుర్గాప్రసాద్ (11).. సమీపంలోని మెండవాని చెరువులో ప్రమాదవశాత్తూ కాలుజారి పడి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గాప్రసాద్ స్వగ్రామం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం. తల్లిదండ్రులు ముద్దాడ జయరాం, భవానీ హైదరాబాద్‌లో వలస కూలీలుగా పని చేస్తున్నారు. దుర్గాప్రసాద్ కుమారుడు వసతి గృహంలో ఉంటూ కురుడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సెలవు దినాల్లో సరియాపల్లిలోని అమ్మమ్మ గారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఆదివారం వసతిగృహం నుంచి తోటి విద్యార్థులతో కలిసి ఆటకు బయటకువెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాలేదు. అమ్మమ్మ గారింటికి వెళ్లి ఉంటాడని వసతిగృహ సిబ్బంది భావించారు. కాగా సోమవారం ఉదయం సరియాపల్లికి చెందిన దుర్గాప్రసాద్ సమీప బంధువు ఒకరు వసతిగృహానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన మరో విద్యార్థికి.. దుర్గాప్రసాద్ కోసం అడగ్గా.. నిన్న సాయంత్రం నుంచి హాస్టల్‌లో లేడని చెప్పాడు. మన ఊరిలోనే తన అమ్మమ్మ గారింటికి రాలేదా? అని అడిగాడు. ఈ విషయం తాతయ్య జులమూరు సింహాచలం, అమ్మమ్మ అప్పలనరసమ్మకు తెలియగా వారు ఆందోళన చెందారు. దుర్గాప్రసాద్ ఎక్కడికి వెళ్లాడో తెలియక కలవరపడ్డారు. గ్రామస్థులు సమీప ప్రాంతాలు వెతకగా.. మెండవాని చెరువులో దుర్గాప్రసాద్ విగతజీవిగా కనిపించాడు. దీంతో అమ్మమ్మ, తాత, బంధువులు బోరున విలపించారు. కమలనాభపురంలో నివసిస్తున్న తాత, నానమ్మ కూడా సంఘటనాస్థలానికి చేరుకుని రోదించారు. ఇంత జరుగుతున్నా వార్డెన్ తమకు సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీనిపై వార్డెన్ లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా.. పలుమార్లు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వారి ఫోన్ పనిచేయలేదని తెలిపారు. దుర్గాప్రసాద్ తాత సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
వార్డెన్ లక్ష్మణరావు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్‌డబ్ల్యూవో త్రినాథరావు ఘటన స్థలానికి చేరుకుని వార్డెన్ నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకున్నారు. దుర్గాప్రసాద్ ఆదివారం ఉదయమే తనకు ఫోన్‌చేసి మాట్లాడానని అమ్మమ్మ ఎలా ఉన్నావని అడిగాడని, ఇప్పుడు ఇలా విగతజీవిగా కనిపించాడని రోదించింది. తన కుమార్తె, అల్లుడికి ఏమి సమాధానం చెప్పాలని విలపించింది.
చర్యలు తీసుకోవాలి: మంత్రి అచ్చెన్న
విద్యార్థి మృతి ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక అందజేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారికి ఫోన్‌లో ఆదేశించారు. వసతిగృహాల్లో విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.