ఉద్దానం పైపులైన్లకు లీకేజీ
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:06 AM
Drinking water problems in Palasa పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందట పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షితనీటి పథకాన్ని మంజూరు చేసింది. దీని ద్వారా నీటి సరఫరా చేస్తోంది. కానీ పైపులైన్లు పాతవి కావడంతో తరచూ లీకులకు గురై నీటి సరఫరాకు విఘాతం కలుగుతోంది.
- పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో తాగునీటి ఇబ్బందులు
- తాత్కాలికంగా మరమ్మతులు
- రూ.50లక్షల అంచనాలతో ప్రతిపాదనలు
పలాస, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందట పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షితనీటి పథకాన్ని మంజూరు చేసింది. దీని ద్వారా నీటి సరఫరా చేస్తోంది. కానీ పైపులైన్లు పాతవి కావడంతో తరచూ లీకులకు గురై నీటి సరఫరాకు విఘాతం కలుగుతోంది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి శాశ్వత మంచినిటి పథకాలు లేవు. పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ జలాశయం పూర్తయితే తప్ప.. తాగునీటి పథకానికి మోక్షం కలగదు. ఆఫ్‌షోర్ ఆధారిత మంచినీటి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100కోట్ల వరకూ నిధులు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బోరుబావులు, వంశధార ఆధారిత చెరువుల వద్ద భారీ బావులు నిర్మించి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మునిసిపాలిటీ మీదుగా జలజీవన్ మిషన్ ద్వారా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీరు అందించే పైపులైన్లు వెళ్తున్నా సాంకేతిక అవరోధాల కారణంగా మునిసిపాలిటీకి నీరు అందించలేకపోతున్నారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి మేరకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత పథకం ద్వారా నీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. పలాస సీతమ్మతల్లి కూరగాయల మార్కెట్, కాశీబుగ్గ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న భారీ ఉపరితల ట్యాంకులకు ముందుగా నీటిని అందించి అక్కడ నుంచి డిస్ర్టిబ్యూటరీ పైపులైన్లు ద్వారా ఇంటింటా తాగునీటిని అందించాల్సి ఉంది. కాగా 28 ఏళ్ల కిందట వేసిన ఉద్దానం రక్షితనీటి పైపులైన్లు తరచూ లీకులు కావడంతో నీటి సరఫరాకు అవరోధం ఏర్పడింది. నీరు వృథాగా పోతోంది. దీంతో ప్రస్తుతం అధికారులు లీకులను కప్పి.. తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. మొత్తం మూడు కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేస్తే సగానికి పైగా మునిసిపాలిటికీ తాగునీరు అందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు రూ.50లక్షల నిధులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే.. తమకు పూర్తిస్థాయిలో తాగునీటి కష్టాలు తీరనున్నాయని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
వేసవినాటికి పూర్తిస్థాయి తాగునీరు
ఈ వేసవి నాటికి అన్నీ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉద్దానం పైపులైన్లకు తరచూ లీకులు కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. రూ.50 లక్షల అంచనాతో కొత్త పైపులైన్లు ఏర్పాటుకు నివేదిక తయారు చేశాం. ఎమ్మెల్యే గౌతు శిరీష సహకారంతో ప్రత్యేక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రస్తుతం లీకులను కప్పుతున్నాం. తాత్కాలికంగా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.
- ఇ.శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్, పలాస