Share News

ప్రజా సంతృప్తిలో ముందంజ

ABN , Publish Date - May 08 , 2026 | 12:32 AM

The district ranks 10th in 'Public Positive Perception' రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా సత్తా చాటుతోంది. గురువారం మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి సంబంధించిన సానుకూల గణాంకాలు వెల్లడయ్యాయి.

ప్రజా సంతృప్తిలో ముందంజ
సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు. చిత్రంలో మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు తదితరులు

  • ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’లో జిల్లాకు 10వ స్థానం

  • గ్రీవెన్స్‌ పరిష్కారంలో 95 శాతం సంతృప్తి

  • ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, ‘సాస్కి’ పనుల్లో టాప్‌-5

  • ఫైర్‌ ఎన్‌వోసీ, ఈసర్వే, గృహ నిర్మాణం, ఇసుక తదితర సేవల్లో విశేష స్పందన

  • శ్రీకాకుళం, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా సత్తా చాటుతోంది. గురువారం మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి సంబంధించిన సానుకూల గణాంకాలు వెల్లడయ్యాయి. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ నేతృత్వంలోని యంత్రాంగం లక్ష్యాల సాధనలో ముందున్నట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ (పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌), ప్రజా ఫిర్యాదుల పరిష్కారం(పీజీఆర్‌ఎస్‌), వాట్సాప్‌ గవర్నెన్స్‌ తదితర కీలక అంశాల్లో జిల్లా గణనీయమైన పురోగతిని నమోదు చేసి రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచింది. ‘పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌’లో గత డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లా స్కోరు 70.7 శాతం ఉంది. తాజాగా మార్చి-ఏప్రిల్‌ స్కోరులో 4.0శాతం వృద్ధిని నమోదు చేసి.. 74.7 శాతం స్కోరుతో రాష్ట్రంలో 10వ స్థానానికి చేరుకుంది.

  • సూపర్‌ హిట్‌ విభాగాలు ...

  • జిల్లాలో ఫైర్‌ ఎన్‌వోసీ జారీలో గతంలో 76.6 శాతం ఉన్న సానుకూలత ఇప్పుడు ఏకంగా 96.7 శాతం (20.1 శాతం) వృద్ధికి చేరుకుంది. స్పోర్ట్స్‌ అథారిటీ, రవాణా శాఖ(వాహన్‌ 76.3 శాతం), ఇసుక 79.2శాతం, ఇళ్ల నిర్మాణం 76.5 శాతం, సారథి 78.5 శాతం, సాంఘిక సంక్షేమ వసతిగృహాలు 81.7 శాతం, భూముల రీసర్వే 88.5 శాతం, రిజిస్ట్రేషన్లశాఖ 78.4 శాతం వంటి విభాగాల్లో ప్రజల నుంచి విశేషమైన సానుకూల స్పందన లభించింది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో 90.5 శాతం, పాఠశాల విద్యలో 84.1 శాతం, అన్నక్యాంటీన్లలో 84.1 శాతం, రేషన్‌ పంపిణీలో 81.9 శాతం మంది హర్షం వ్యక్తం చేశారు.

  • ఈ విభాగాలపై దృష్టి పెట్టాలి...

  • ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణలో ప్రజల సంతృప్తి గతంలో 57.5 శాతం ఉండగా ఇప్పుడు 45.3 శాతానికి పడిపోయింది. వీధి దీపాలు, తాగునీరు 70.6 శాతం, దీపం-2.0 (69.1శాతం), బస్సు సర్వీసులు 79.4 శాతం, విద్యుత్‌ సేవలు 71.8శాతం చొప్పున ఉంది. గతంతో పోలిస్తే వీటిపై స్వల్పంగా సంతృప్తి తగ్గింది.

  • ఫిర్యాదుల పరిష్కారంలో 95 శాతం సక్సెస్‌

  • ప్రభుత్వానికి వచ్చే ప్రజాఫిర్యాదుల పరిష్కారం (పీజీఆర్‌ఎస్‌)లో జిల్లా యంత్రాంగం అద్భుత పనితీరు కనబరిచింది. గత జనవరి 31 నుంచి ఈ నెల 1 వరకు జిల్లాలో 4,046 వ్యక్తిగత ఫిర్యాదులు రాగా, అందులో 2,456 ఫిర్యాదులను పరిష్కరించారు. 95శాతం మంది ఫిర్యాదుదారులు ప్రభుత్వ సేవపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కమ్యూనిటీ గ్రీవెన్స్‌(సామూహిక ఫిర్యాదుల) విభాగంలో 1,705 రాగా, 1,089 పరిష్కరించారు. ఇందులోనూ 94శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.

  • సాస్కి(ఎస్‌ఏఎస్‌సీఐ), ఆర్వో ప్లాంట్ల ఏర్పాటులో ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌’ :

  • మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ‘సాస్కి’ పనుల పురోగతిలో రాష్ట్రంలోనే ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌’ ఐదు జిల్లాల్లో (పశ్చిమగోదావరి, విశాఖపట్నం, ఏలూరు, బాపట్లతోపాటు) శ్రీకాకుళం నిలిచింది. విద్యా సంస్థలు, వసతిగృహాల్లో ఆర్వో వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా కర్నూలు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం జిల్లా ఉత్తమ పనితీరు కనబరిచిందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నారు.

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌లో స్మార్ట్‌ సేవలు..

  • సాంకేతికతను ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ అమలులో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ద్వారా గత నెలలో జిల్లా నుంచి 38,610 సర్వీస్‌ రిక్వెస్ట్‌లు వచ్చాయి. గత వారం రోజుల్లోనే 6,386 రిక్వెస్ట్‌లు రావడం విశేషం. పౌరులకు డిజిటల్‌ సేవలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా, 6.17 లక్షల ఇళ్లకుగానూ, ఇప్పటివరకు 90,208 ఇళ్లను కవర్‌ చేసి సుమారు 1.15 లక్షల మంది పౌరులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా శిక్షణ ఇచ్చారు.

  • దాహార్తి తీర్చేందుకు యాక్షన్‌ప్లాన్‌ :

  • వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లాలోని 5 మండలాల్లో 18 అత్యంత సమస్యాత్మక గ్రామాలను యంత్రాంగం గుర్తించింది. ఇక్కడ బోర్‌వెల్స్‌ను ఫ్లషింగ్‌ చేసేందుకు రూ.4.60 లక్షలతో సమ్మర్‌ కంటిన్జెన్సీ ప్లాన్‌ను ప్రభుత్వం ముందుంచింది.

  • అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి

  • పీఎం జన్‌మన్‌ పథకం కింద మంజూరైన 27 అంగన్‌వాడీ కేంద్రాలకుగానూ 21 భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 3 ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 675 (20.10 శాతం) కేంద్రాలను పాఠశాలల ఆవరణలోకి మార్చి పటిష్టపరిచారు. మొత్తం మీద కలెక్టర్ల సమావేశపు సమీక్షలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - May 08 , 2026 | 12:32 AM