Share News

సొంతపార్టీ నేతలు.. ఊహు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:03 AM

సీదిరి అప్పలరాజు.. వైసీపీ హయాంలో మంత్రిగా కొనసాగారు. తన నోటిదురుసుతో ప్రత్యర్థి పార్టీలపై పెట్రేగిపోయారు.

 సొంతపార్టీ నేతలు.. ఊహు!

సీదిరి అప్పలరాజు తీరుపై తీవ్ర అసంతృప్తి!

ఒక తప్పు కప్పిపుచ్చేందుకు మరిన్ని తప్పులు చేశారని..

గతంలో ఆయన నోటిదురుసు గుర్తు చేసుకుంటున్న వైనం

మీడియా ముందుకు రాలేకపోతున్న మాజీ మంత్రి

శ్రీకాకుళం, జూలై 16(ఆంధ్రజ్యోతి): సీదిరి అప్పలరాజు.. వైసీపీ హయాంలో మంత్రిగా కొనసాగారు. తన నోటిదురుసుతో ప్రత్యర్థి పార్టీలపై పెట్రేగిపోయారు. తమ నాయకుడు జగన్‌ మెప్పు కోసం ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. ఇప్పుడు అధికారం పోయింది. అయినా ఆయన తీరులో మార్పు కనిపించడంలేదు. యాక్సిడెంట్‌ చేసి ఒకరి మృతికి కారణమైన తన కొడుకును తప్పించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. దీంతో పోలీసులు ఆయన కొడుకు ఆరవ్‌, స్నేహితుడు సిద్ధార్థతో పాటు అప్పలరాజుపై కూడా కేసులు నమోదు చేశారు. ఆయన్ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే విశాఖ పర్యటనలో ఇటీవల వైసీపీ అధినేత జగన్‌.. 18 పిల్లోడు అంటూ వెనకేసుకుని వచ్చినా.. ఇక్కడి పార్టీ నాయకులు మాత్రం ఆయనకు మద్దతుగా రావడంలేదని తెలుస్తోంది. కారణం ఆయన చేసిన నిర్వాకమేనని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సరే.. ఇప్పుడు కూడా అడ్డదారులు ఏంటని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. అప్పలరాజు తీరును వారు తప్పుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సీదిరి అప్పలరాజు చేసింది తప్పేనని, యాక్సిడెంట్‌ చేసిన వెంటనే కొడుకును సరెండర్‌ చేసి ఉంటే బాగుండేదని, ఒక తప్పు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని వైసీపీకి చెందిన కొందరు నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కాగా కుమారుడి యాక్సిడెంట్‌ చేసిన ఘటన నుంచి సీదిరి ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. అనుచరులతో మాత్రం మంతనాలు జరుపుతున్నారు. బెయిల్‌ పిటీషన్‌లు తిరస్కరణకు గురవుతున్నా.. ఇతర కేసుల్లో బెయిల్‌ లభించేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాను, తన కుమారుడు ఆరవ్‌తో పాటు త్యాడి బయటపడాలని చేస్తున్న యత్నాలు గట్టెక్కేలా లేవు. పోలీసుల నిఘా చాలా స్పష్టంగా ఉంది.

Updated Date - Jul 17 , 2026 | 12:03 AM