రణస్థలం ఎంపీపీగా ‘లంక’
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:10 AM
రణస్థలం ఎంపీపీ పదవికి ముగ్గుర్ని ఎంపిక చేశారు. రెండేళ్ల చొప్పున ఇద్దరికి.. చివరి ఏడాది మరొకరికి ఎంపిక చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామ్ అధ్వర్యంలో ఎంపీటీసీలతో పాటు కూటమి నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి వరకూ భేటీ అయ్యారు.
ప్రత్యేక ఆహ్వానితుడిగా నడుకుదిటి తేజబాబు
సవ్యంగా మిగతా మూడు మండలాల ఎంపిక
‘ఎచ్చెర్ల కూటమి’లో కుదిరిన సమన్వయం
రణస్థలం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రణస్థలం ఎంపీపీ పదవికి ముగ్గుర్ని ఎంపిక చేశారు. రెండేళ్ల చొప్పున ఇద్దరికి.. చివరి ఏడాది మరొకరికి ఎంపిక చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామ్ అధ్వర్యంలో ఎంపీటీసీలతో పాటు కూటమి నేతలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి వరకూ భేటీ అయ్యారు. రణస్థలానికి సంబంధించి ఎంపీపీగా రావాడ ఎంపీటీసీ సభ్యుడు లంక ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. తరువాత రెండేళ్లు కోష్ట ఎంపీటీసీ సభ్యుడు పిషిని జగన్నాథంనాయుడు పేరును ఖరారు చేశారు. చివరి ఏడాది మాత్రం పిన్నింటి వెంకట భానోజీ పేరును ప్రకటించారు. మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడిగా నడకుదిటి తేజాబాబు ఎంపిక చేశారు. అయితే తనకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆశచూపారాని.. తీరా ఇప్పుడు పంపకాలు చేస్తున్నారంటూ జగన్నాథంనాయుడు అలిగి ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కనీసం తన సీనియార్టీ, వయసును కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మిగతా మండలాలు కొలిక్కి..
నియోజకవర్గంలో మిగతా మూడు మండలాల్లో ఎంపీపీల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎచ్చెర్ల ఎంపీపీ పదవి భర్తీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. తొలి రెండున్నరేళ్లు టీడీపీ సీనియర్ నాయకుడు బెండు మల్లేష్ భార్య రమాదేవిని ఎంపీపీగా చేసేందుకు నిర్ణయించారు. తరువాత రెండున్నరేళ్లు పైడి నూకరాజు భార్య శైలజకు అవకాశం కల్పించారు. జి.సిగడాం మండలానికి డర్రు రమణమ్మను ఎంపీపీగా ఎంపిక చేశారు. ఎంపీపీ ప్రతినిధిగా కుమరాపు రవికుమార్ నాయకత్వాన్ని బలపరిచారు. లావేరు మండలానికి సంబంధించి తొలి రెండున్నరేళ్లు బీజేపీకి చెందిని ఇజ్జాడ శ్రీనివాసరావుకు, చివరి రెండున్నరేళ్లు టీడీపీ నాయకుడు ముప్పిడి సురేష్‌కు అవకాశం కల్పించారు. అయితే మండల ప్రత్యేకాహ్వానితుడుగా సురేష్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో పదవుల పంపకాలు సజావుగా పూర్తయ్యాయి.
నరసన్నపేట ఎంపీపీ పదవి శిమ్మ కుటుంబానికే..
నరసన్నపేట, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ అధ్యక్షుల నియామకానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నరసన్నపేట ఎంపీపీ అభ్యర్థిగా మాకివలస గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు శిమ్మ రామినాయుడు కుటంబానికే ముచ్చటగా మూడో సారి వరించింది. ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో 22 స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాలు గెలుచుకుంది. మాకివలస ఎంపీటీసీగా గెలుపొందిన శిమ్మ లక్ష్మి ఎంపీపీగా ఖరారు చేశారు. గతంలో ఇదే కుటంబానికి చెందిన శిమ్మ రామినాయుడు, శిమ్మ పార్వతమ్మ ఎంపీపీలుగా పనిచేశారు. లక్ష్మి భర్త శిమ్మ చంద్రశేఖర్ ప్రస్తుతం వంశధార డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.