ఉజ్జిడిమెట్టలో భూదందా!
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:56 PM
Land grabbers eye land worth ₹50 crore పలాస నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు చోటానేతలు, అధికార పార్టీ పెద్దల అండతో సాగించిన భూదందాలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఉజ్జిడిమెట్ట ప్రాంతంలో సుమారు రూ.50 కోట్ల విలువైన 30ఎకరాల భూమిని కాజేసేందుకు అక్రమార్కులు పన్నిన వ్యూహం విస్మయానికి గురిచేస్తోంది.
రూ.50 కోట్ల భూమిపై కబ్జాదారుల కన్ను
అసలు యజమానులు వేరు.. రికార్డుల్లోకి ఎక్కింది వేరు!
నకిలీ వీలునామాతో చేతులు మారిన 30 ఎకరాలు
‘సుడా’ అనుమతుల్లేకుండానే రూ.12 కోట్ల రియల్ వ్యాపారం?
వైసీపీ కీలకనేత అండదండలు ఉన్నాయంటూ ఆరోపణలు
సీఎస్ ఆదేశించినా కదలని రెవెన్యూ ఫైళ్లు
సమగ్ర విచారణ కోరుతున్న పలాస ప్రజలు
శ్రీకాకుళం, జూలై 12(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు చోటానేతలు, అధికార పార్టీ పెద్దల అండతో సాగించిన భూదందాలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఉజ్జిడిమెట్ట ప్రాంతంలో సుమారు రూ.50 కోట్ల విలువైన 30ఎకరాల భూమిని కాజేసేందుకు అక్రమార్కులు పన్నిన వ్యూహం విస్మయానికి గురిచేస్తోంది. పేర్ల పోలికను ఆసరాగా చేసుకుని, నకిలీ వీలునామాలు సృష్టించి, కోట్లాది రూపాయల రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశోధనాత్మక కథనం.
1960లో మందస జమీందార్.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన న్యాయవాది రావి సాంబశివరావుకు ఉజ్జిడిమెట్ట తదితర ప్రాంతాల్లో 250 ఎకరాల భూమిని దాఖలు పరిచారు. దశాబ్దాల కాలంలో ఆ కుటుంబ సభ్యులు (నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు) తమ అవసరాల కోసం ఆ భూములను విక్రయించారు. వారి పేరు మీదనే పలాసలో రామకృష్ణాపురం కాలనీ కూడా వెలిసింది. అయితే బొడ్డపాడు ప్రాంత రైతుల పశువుల మేత కోసం ఉజ్జిడిమెట్ట వద్ద 30 ఎకరాలను ఆ కుటుంబం ప్రత్యేకంగా విడిచిపెట్టింది. ఈ భూమి మందస మండలం కొండలోగాం గ్రామం నుంచి పలాస మండలం రామకృష్ణాపురం వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ భూమి ధర సుమారు రూ.50 కోట్లకు చేరడంతో అక్రమార్కుల కన్ను దీనిపై పడింది.
తెరపైకి తుళ్లూరు వ్యక్తి
అసలు యజమాని రావి సాంబశివరావుకు చట్టబద్ధమైన వారసులు ఉన్నప్పటికీ.. భూమిని కాజేసేందుకు అక్రమార్కులు ఓ స్కెచ్ వేశారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన మరొక ‘రావి సాంబశివరావు’ అనే వ్యక్తి పేరును వాడుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వైసీపీ నాయకుడి చొరవతో దొంగ వీలునామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తుళ్లూరుకు చెందిన సాంబశివరావు కోడలు ఉమామహేశ్వరి పేరును రికార్డుల్లోకి చేర్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతనే విక్రయాలకు తెర తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వందల మందికి టోకరా...
రికార్డులు మారిన వెంటనే ఉమామహేశ్వరి నుంచి ఆ భూమి ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి, ఆ తర్వాత పలాసలో కీలక వైసీపీ నాయకుడు చేతుల్లోకి వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ వైసీపీ నాయకుడు ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా సేల్ కమ్ జీపీఏ జరిగిపోయింది. వ్యవసాయ భూమిని అడ్డగోలుగా గజాల కింద మార్చేసి ఓ రియల్‌ఎస్టేట్ సంస్థకు రాసిచ్చారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) నుంచి అనుమతులు లేకపోయినా.. ఉన్నాయని నమ్మించి ప్లాట్ల పేరుతో సుమారు 200 మంది అమాయకుల నుంచి రూ. 12కోట్లకు పైగా వసూలు చేసి బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ బాగోతం వెనుక వైసీపీ కీలక నేత ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అప్పట్లో అధికార పెద్దల అండ లేకుండా స్థానిక నాయకుడు ఇంత భారీస్థాయిలో రికార్డులు తారుమారుకు, కుంభకోణానికి పాల్పడలేరని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సీఎస్ ఆదేశాలు బేఖాతర్!
ఈ భూవివాదం ముదిరిన నేపథ్యంలో 2022లో మావోయిస్టుల పేరుతో ఆక్రమణదారులను హెచ్చరిస్తూ లేఖలు విడుదలయ్యాయి. దీంతో కొంతకాలం వెనక్కి తగ్గిన అక్రమార్కులు.. మళ్లీ పాత దందాకే తెరతీశారు. అసలు యజమానులను కాదని, సంబంధం లేని వ్యక్తులతో రికార్డులు ఎలా మార్చారంటూ కొద్దినెలల కిందట కలెక్టర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు పక్కా ఆధారాలతో, 12 రకాల అభ్యంతరాలతో ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్.. తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రామకృష్ణాపురం ప్రాంత భూములు కొండలోగాం సర్వేలోకి ఎలా వెళ్లాయి? క్లెయిమ్ చేస్తున్న పలాస వైసీపీ నాయకుడి డాక్యుమెంట్ల వాస్తవికత ఏమిటి? జమీందార్ ఇచ్చిన వాస్తవ పట్టాదారుడి సర్వే నంబర్లు ఏవి? అనే కోణంలో విచారించాలన్నారు. కానీ, ఆ ఫైల్ నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం రెవెన్యూ అధికారుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
సమగ్ర విచారణ చేయాలి
ఈ కుంభకోణంపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విజిలెన్స్ శాఖల సమన్వయంతో తక్షణమే ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేయాలని పలాస వాసులు డిమాండ్ చేస్తున్నారు. భూ రికార్డులు, వారసత్వ ధ్రువపత్రాల జారీ, రిజిస్ట్రేషన్ పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ ఒప్పందాలను క్షుణ్నంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి, వైసీపీ కీలక నేత పాత్ర ఎంత? కళ్లెదుటే ఇన్ని తప్పులు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి దోషులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.