Share News

నకిలీ పత్రాలతో భూకబ్జా

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:54 PM

Conspiracy to occupy government land అదో ప్రభుత్వ రిజర్వ్‌డ్‌ స్థలం. సుమారు రూ.3కోట్ల విలువైన ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై స్థలాన్ని స్వాధీనం చేసేందుకు కుట్ర పన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదు చేసి.. వారిలో 9 మందిని నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మంగళవారం శ్రీకాకుళం రూరల్‌ సీఐ పైడిపునాయుడు తన సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.

నకిలీ పత్రాలతో భూకబ్జా
వివరాలు వెల్లడిస్తున్న సీఐ పైడిపునాయుడు, పోలీసుల అదుపులో నిందితులు

రూ.3 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర

తొమ్మిది మంది నిందితుల అరెస్టు

శ్రీకాకుళం క్రైం, జూలై 28(ఆంధ్రజ్యోతి): అదో ప్రభుత్వ రిజర్వ్‌డ్‌ స్థలం. సుమారు రూ.3కోట్ల విలువైన ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై స్థలాన్ని స్వాధీనం చేసేందుకు కుట్ర పన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదు చేసి.. వారిలో 9 మందిని నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మంగళవారం శ్రీకాకుళం రూరల్‌ సీఐ పైడిపునాయుడు తన సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ‘శ్రీకాకుళంలోని ఎస్‌బీఐ స్టాఫ్‌ కాలనీ లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం సుమారు 11 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రిజర్వ్‌ చేశారు. కాలనీ స్థాపించినప్పుడు వాచ్‌మన్‌గా ఉన్న వజ్జా మల్లేష్‌, అతని కుటుంబ సభ్యులు.. సుమారు రూ.3కోట్ల విలువైన ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారు. నకిలీ పత్రాలు సైతం సృష్టించారు. దీనిపై కాలనీ అధ్యక్షుడు పుప్పాల జగదీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టాం. తహసీల్దార్‌, రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, అధికారిక ముద్రలు ఉపయోగించి తప్పుడు పొజిషన్‌ సర్టిఫికెట్‌ రూపొందించినట్టు గుర్తించాం. ఆ నకిలీ ప త్రాల ఆధారంగా ప్రభుత్వ రిజర్వ్‌ స్థలాన్ని అక్రమంగా బదిలీ చేసేందుకు సేల్‌ డీడ్‌ సిద్దం చేసినట్టు దర్యాప్తులో తేలింది. నిందితులు ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడానికి ముందస్తు పథకం ప్రకారం కుట్ర పన్నినట్టు, నకిలీ పత్రాల తయారీ కోసం సుమారు రూ.3లక్షలకు ఒప్పందం చేసుకొని కొంత మొత్తం ముందుగానే చెల్లించినట్టు గుర్తించాం. డాక్యుమెంట్‌ రైటర్లు, మధ్యవర్తులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తుల సహకారంతో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని యత్నించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 11 మంది ఉన్నట్టు గుర్తించాం. ఏ-1 వజ్జా కళ్యాణ్‌రామ్‌, ఏ2 వజ్జా రమణమ్మ, ఏ3 వజ్జా నాగరాజు, ఏ-4 వజ్జా మల్లేష్‌, ఏ5 వజ్జా రాములమ్మ వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. వీరు ఏ6 తిర్లంగి లక్ష్మణరావు(కొత్తూరు), ఏ7 వంబరవెల్లి శ్రీనివాస్‌ (రైస్‌మిల్లు యజమాని - కొత్తూరు), ఏ8 ముండేటి సురేష్‌(రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి - ఆమదాలవలస), ఏ9 మొదలవలస వేణుగోపాలరావు (డాక్యుమెంట్‌ రైటర్‌ - ఆమదాలవలస), ఏ10 కోసూరు మహేశ్వరరావు ( స్టిక్కరింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు - శ్రీకాకుళం), ఏ11 కారాపాటి అనీల్‌కుమార్‌ (జూనియర్‌ అసిస్టెంట్‌ - ఇచ్ఛాపురం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం)పై కేసు నమోదు చేశాం. వీరిలో వజ్జా మల్లేష్‌, రాములమ్మ మినహా మిగిలిన తొమ్మిది మందిని మంగళవారం అరెస్టు చేశాం. వారిని కోర్టుకు తరలించామ’ని సీఐ పైడిపునాయుడు తెలిపారు. ప్రభుత్వ భూములు, రిజర్వ్‌ స్థలాలను ఆక్రమించేందుకు యత్నించినవారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ కరణం వెంకట సురేష్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:54 PM