Share News

కుంటుపడిన నీటినిల్వలు

ABN , Publish Date - May 21 , 2026 | 11:31 PM

Water conservation structures జల సంరక్షణ నిర్మాణాల లెక్కలు కాగితాలపై ఘనంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నీటి నిల్వల పరిస్థితి మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, పంట కుంటలు, ఊట కుంటలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు.

కుంటుపడిన నీటినిల్వలు
శ్రీకాకుళం రూరల్‌ వాడాడ జంక్షన్‌ వద్ద నీరులేక బీటలువారిన చెరువు

  • జిల్లాలో 31,529 జల సంరక్షణ నిర్మాణాలు

  • నీటి నిల్వ సామర్థ్యం 2,138.72 ఎంసీఎఫ్‌టీలు

  • నిల్వ ఉన్నది 105.42 ఎంసీఎఫ్‌టీలే

  • పలు మండలాల్లో ఉనికిలో లేని ఊట కుంటలు

  • ‘ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌’ తాజా గణాంకాలు

  • శ్రీకాకుళం, మే 21(ఆంధ్రజ్యోతి): జల సంరక్షణ నిర్మాణాల లెక్కలు కాగితాలపై ఘనంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నీటి నిల్వల పరిస్థితి మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, పంట కుంటలు, ఊట కుంటలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్మర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌) వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తాజా గణాంకాలు జిల్లా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వేలాది సంఖ్యలో నీటికుంటలు నిర్మించినా.. పూర్తిసామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెరువులు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి.

  • జిల్లావ్యాప్తంగా 31,529 జల సంరక్షణ నిర్మాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 2,138.72 ఎంసీఎఫ్‌టీ (మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లు) నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కేవలం 105.42 ఎంసీఎఫ్‌టీ (సుమారు 5శాతం కన్నా తక్కువ) నీరు మాత్రమే నిల్వ ఉండటం గమనార్హం. జిల్లాలో అత్యధికంగా మందస మండలంలో 7.3 ఎంసీఎఫ్‌టీ నీరు, జి.(గంగువారి) సిగడాంలో 7.04 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది.

  • జిల్లాలో 4,135 చెక్‌డ్యామ్‌లు ఉండగా, వాటి నీటి నిల్వ సామర్థ్యం 1,450.55 ఎంసీఎఫ్‌టీగా ఉంది. వాటిలో నిల్వ ఉన్న నీరు కేవలం 66.57 ఎంసీఎఫ్‌టీ మాత్రమే. అలాగే 6,761 పంట కుంటలు లేదా ఫార్మ్‌పాండ్స్‌ (సామర్థ్యం 48 ఎంసీఎఫ్‌టీ, నిల్వ 13.54 ఎంసీఎఫ్‌టీ), 534 ఊట కుంటలు లేదా పెర్కొలేషన్‌ ట్యాంకులు (సామర్థ్యం 188.5 ఎంసీఎఫ్‌టీ, నిల్వ 4.76 ఎంసీఎఫ్‌టీ) ఉన్నాయి.

  • మండలాల వారీగా పరిశీలిస్తే..

  • జిల్లాలోని మండలాల వారీగా జల సంరక్షణ నిర్మాణాలు సంఖ్య, వాటి సామర్థ్యాన్ని పరిశీలిస్తే తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఎచ్చెర్ల మండలం 1,950 నిర్మాణాలతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో లావేరు (1,848). బూర్జ (1,778), గార (1,757), పోలాకి (1,727) మండలాలు ఉన్నాయి.

  • హిరమండలంలో అత్యల్పంగా కేవలం 306 నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. కవిటి (401), వజ్రపుకొత్తూరు (529), ఇచ్ఛాపురం (556) మండలాలు కూడా తక్కువ నిర్మాణాలతో వెనుకబడి ఉన్నాయి.

  • లావేరు మండలంలో అత్యధికంగా 384 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత మెళియాపుట్టి (294), పాతపట్నం (273) మండలాలు ఉన్నాయి. పోలాకి మండలంలో కేవలం 14 చెక్‌డ్యామ్‌లు మాత్రమే ఉన్నాయి.

  • ఎచ్చెర్ల మండలంలో రికార్డుస్థాయిలో 882 పంట కుంటలు ఉండగా, లావేరులో 574 ఉన్నాయి.

  • నిర్వహణ లోపం ఉందా...?

  • పోలాకి మండలంలో 1,727 నిర్మాణాలు ఉన్నప్పటికీ, అక్కడ కేవలం 0.62 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే నిల్వ ఉంది. అలాగే 896 నిర్మాణాలు ఉన్న కోటబొమ్మాళిలో 0.85 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే ఉంది. ఈ గణాంకాలు చూస్తుంటే నిర్మాణాలు నామమాత్రంగా ఉన్నాయా లేక పూడికతీత పనులు జరగలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తూరులో అత్యధికంగా 110 ఊట కుంటలు ఉన్నాయి. గార, కంచిలి, పోలాకి, సరుబుజ్జిలి, సోంపేట మండలాల్లో భూగర్భజలాలను పెంచే కీలకమైన ఊట కుంటలు సున్నాగా నమోదు కావడం ప్రణాళికా లోపాన్ని ఎత్తిచూపుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో, నిర్మాణాలను బాగుచేసి, పూడికలు తీసి, పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - May 21 , 2026 | 11:31 PM