తలసరిలో వెనుకంజ
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:44 PM
Report of the Conference of Ministers and Secretaries రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర - 2047’ లక్ష్య సాధనలో జిల్లా కీలక పాత్ర పోషించనుంది. ఒకవైపు పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్నా, వ్యక్తిగత ఆదాయంలో మాత్రం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున.. 26వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈసారి 26వ ర్యాంకుతో.. ‘జీరో పావర్టీ’కి ఎంపిక
వచ్చే ఏడాదికి 9 శాతం వృద్ధి ఉంటుందని అంచనా
పేదరిక రహిత ఏపీకి మన ‘సింగుపురం’ కుటుంబమే ప్రామాణికం
రూ.550 కోట్లతో ఎయిర్‌పోర్ట్.. ఏఏఐతో కలిసి జాయింట్ వెంచర్
ఆర్థికశాఖ వద్ద బుడగట్లపాలెం హార్బర్ ఫైల్
మంత్రులు, కార్యదర్శుల సదస్సు నివేదికలో వెల్లడి
శ్రీకాకుళం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర - 2047’ లక్ష్య సాధనలో జిల్లా కీలక పాత్ర పోషించనుంది. ఒకవైపు పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్నా, వ్యక్తిగత ఆదాయంలో మాత్రం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున.. 26వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమికొట్టేందుకు రూపొందించిన ‘జీరో పావర్టీ మిషన్’ (పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్)కు మన జిల్లాలోని సింగుపురం గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబాన్ని ప్రామాణికంగా ఎంపిక చేశారు. అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వెల్లడించిన నివేదికలో జిల్లా ఆర్థిక పరిస్థితి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
ఆదాయంలో అట్టడుగున.. వృద్ధిలో పర్వాలేదు..
జిల్లా ఆర్థిక ముఖచిత్రంపై నివేదిక మిశ్రమ ఫలితాలను వెల్లడించింది.
తలసరి ఆదాయం : 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా తలసరి ఆదాయం రూ. 1,65,921 మాత్రమే. దీంతో రాష్ట్రంలోని చివరి స్థానంలో సిక్కోలు 26వ ర్యాంకులో నిలిచింది. 2025-26 నాటికి ఇది రూ.1,80,971కి పెరుగుతుందని, ఇది 9 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసినా, ర్యాంకులో మాత్రం మార్పు ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది.
పారిశ్రామిక జోరు.. : ఆదాయంలో వెనుకబడినా పారిశ్రామిక రంగంలో మాత్రం జిల్లా దూసుకుపోతోంది. 2024-25లో 14.00 శాతం వృద్ధి నమోదు కాగా, వచ్చే ఏడాదికి అది 16.62 శాతానికి పెరుగుతుందని అంచనా.
వ్యవసాయం డీలా : వ్యవసాయ రంగం కొంత ఆందోళన కలిగిస్తోంది. 2025-26 అంచనాల ప్రకారం -0.02 శాతం రుణాత్మక వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. పనితీరు సూచికల్లో (కేపీఐ) మాత్రం 90 స్కోరుతో జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. సేవా రంగంలోనూ 13.04 శాతం వృద్ధి రేటుతో నిలకడగా ఉంది.
దిక్సూచిగా ‘సింగుపురం’ సామాన్య కుటుంబం
ఏటా రూ.20వేల కంటే తక్కువ ఆదాయంతో, కట్టెల సేకరణే జీవనాధారంగా బతుకుతున్న శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామానికి చెందిన 43ఏళ్ల మహిళ (భర్తకు దూరంగా ఉంటున్నారు), ఆమె కుమారుడి దీనస్థితిని పేదరిక నిర్మూలన మిషన్‌కు ఉదాహరణగా తీసుకున్నారు. రేషన్, పింఛన్ వంటివి అందుతున్నా.. స్వయంఉపాధి లేక పేదరికంలో మగ్గుతున్న ఇటువంటి కుటుంబాలను గుర్తించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడమే ఈ మిషన్ లక్ష్యం. జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ మిషన్ ఇక్కడ కీలకం కానుంది.
ఎయిర్‌పోర్ట్, హార్బర్‌కు లైన్‌క్లియర్!
జిల్లావాసుల చిరకాల స్వప్నమైన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌పై నివేదికలో స్పష్టత వచ్చింది. జిల్లాలో 1,383.71 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక(టీఈఎఫ్‌ఆర్) ఇప్పటికే పూర్తయింది. గతేడాది డిసెంబరులోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఏఏఐకి వెళ్లాయి.
రూ.444 కోట్ల(సవరించిన అంచనా) వ్యయంతో ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో చేపట్టనున్న ఫిషింగ్ హార్బర్ పనులకు సంబంధించి ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. అక్కడ గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు ప్రారంభం కానున్నాయి.
‘సీవీడ్’ సాగులో ఆదర్శం ..
సముద్రపు నాచు(సీవీడ్) సాగులో సిక్కోలు జిల్లా రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో 750 కుటుంబాలు, తంజాదిలో 40 మంది మహిళలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. మూలపొలంలో ఇప్పటికే రెండు విడతలుగా పంట తీసి రూ.8.16 లక్షల విలువైన ఉత్పత్తిని సాధించడం విశేషం. మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఇది మారుతోంది.
చదువు, సంక్షేమంలో భేష్..
సంకల్ప్ ప్రీ-ఫైనల్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్(70.81 శాతం), సెకండియర్ (79.27 శాతం) ఫలితాల్లో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగం మెరుగైన పనితీరు కనబరిచింది. ‘బంగారు కుటుంబం’ కార్యక్రమంలో జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది.