షరా‘మామూళ్లు’!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:39 AM
Allegations against officials జిల్లాలోని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. రోగులు చికిత్స కోసం వైద్యుడి వద్దకు వెళితే చాలు.. ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్‌లు చేయడం పరిపాటిగా మారింది.
జిల్లాలో ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లపై కొరవడుతున్న నిఘా
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
తనిఖీ అధికారుల తీరుపై ఆరోపణలు
ఇన్నేళ్లలో ఒక్క కేసూ నమోదుకాని వైనం
కలెక్టరేట్, జూలై 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. రోగులు చికిత్స కోసం వైద్యుడి వద్దకు వెళితే చాలు.. ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్‌లు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో 110 లేబరేటరీలు, 138 స్కానింగ్ సెంటర్లు అధికారికంగా ఉన్నాయి. వీటిని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఐఓ, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఏడీఎంహెచ్‌వో, డీపీఎంవో కూడిన ఒక బృందం ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీ చేయాలి. రిపోర్టులను అందజేయాలి. కాగా జిల్లాలో ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లన్నీ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. తనిఖీల సమయంలో ల్యాబ్ అయితే రూ.5వేలు, స్కానింగ్ సెంటర్‌కు రూ.10వేలు చొప్పున నిర్వాహకుల నుంచి అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొత్తవాటికి ముందుగా మామూళ్లు ముట్టజెప్పనిదే అనుమతులు మంజూరు కావనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా జరగడం లేదని అధికారులు నివేదిక ఇస్తున్నారు. కానీ ఆడపిల్లల జననాలు ఎందుకు తగ్గుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఏడాది కాలంలో 13,679 మంది మగ శిశువులు జన్మించగా, 11,732 మంది మాత్రమే ఆడపిల్లలు జన్మించారు. స్ర్తీ, పురుష నిష్పత్తితో అసమానతలు పెరిగితే.. భవిష్యత్‌లో సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనవసర పరీక్షలతో దోపిడీ?
కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు అవసరానికి మించిన పరీక్షలు వైద్యులు సూచిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరీక్షల పేరిట అధిక మొత్తం డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లలో ధరల జాబితా, బిల్లుల జారీ వంటివి అమలు చేయకపోవడంతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. ‘మామూళ్ల’ కారణంగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్‌ల్లో వినియోగించే పరికరాల కాలిబ్రేషన్, సిబ్బంది అర్హతలు, రసాయనాల నాణ్యత, నివేదికల కచ్చితత్వం వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒక ల్యాబ్, మరో ల్యాబ్ అందజేసే రిపోర్టుల్లో తరచుగా తేడాలు వస్తున్నాయి. ఈ నివేదికల్లో తేడాలు ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిస్థితులను మెరుగుపరచాలని జిల్లావాసులు కోరుతున్నారు. క్రమం తప్పకుండా ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి.. దోపిడీ అరికట్టేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ విషయమై ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ టి.శ్రీకాంత్ వద్ద ప్రస్తావించగా ‘జిల్లాలో ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.