Share News

నిధుల్లేక.. పనులు సాగక

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:34 AM

టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

 నిధుల్లేక.. పనులు సాగక
మాలపేట గెడ్డ ఇలా..

- ఏడేళ్లుగా మైనర్‌ ఇరిగేషన్‌శాఖకు మొండిచేయి

- అభివృద్ధికి నోచుకోని చెరువులు, గెడ్డలు

- రూ.35కోట్లతో అధికారుల ప్రతిపాదనలు

- ‘పూర్వోదయ’ నిధులపైనే ఆశలు

టెక్కలి, జూలై 7(ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో ఆ శాఖ పరిధిలోని చెరువులు, గెడ్డలు, వాగులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. టెక్కలి పరిధిలో 214 చెరువులు, నందిగాంలో 384, సంతబొమ్మాళిలో 189, కోటబొమ్మాళి పరిధిలో 240 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా మాలపేటగెడ్డ, దుర్గగెడ్డ, గరీబుల గెడ్డ, బొప్పాయిపురం, సండెమ్మ, భీంపురం, కాంట్రగడ తదితర గెడ్డలు ఉన్నాయి. గత ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో వీటి రూపురేఖలు మారిపోయాయి. పిచ్చిమొక్కలు, పూడికతో గెడ్డలు నిండిపోవడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇవి బాగుపడాలంటే మైనర్‌ ఇరిగేషన్‌కు నిధులు అవసరం. కానీ, ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో కనీసం చెరువుల వద్ద పడిన గండ్లు కూడా పూడ్చలేని దుస్థితి నెలకొంది. 2018 వరకు నీరు-చెట్టు కింద జరిగిన పనులు మినహా ఆ తరువాత ఎలాంటి అభివృద్ధి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖలో జరగలేదు.

రూ.35కోట్లు అవసరం..

ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మైనర్‌ ఇరిగేషన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీడీఆర్‌ నిధులు గానీ, మరే ఇతర నిధులు గానీ మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ నియోజకవర్గానికి రూ.3కోట్లు చొప్పున కేటాయించింది. అయితే, టెక్కలి నియోజకవర్గం పరిధిలో మేజర్‌ ఇరిగేషన్‌కే ఆ నిధులు కేటాయించారు తప్పా మైనర్‌ ఇరిగేషన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశంలో రూ.35కోట్లు అవసరమని చిన్న నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది మైనర్‌ ఇరిగేషన్‌లో టెక్కలి నియోజకవర్గానికి పూర్తిగా మొండిచేయి చూపగా, జిల్లాలో ఇతర ప్రాంతాలకు అరకొరగా ఆపరేషన్‌ అండ్‌ మెంటినెన్స్‌ నిధులు కేటాయించారు. ఇప్పటికే మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో ప్లాన్‌ గ్రాంట్‌ పూర్తిగా నిలిపివేశారు. కనీసం తుఫాన్లు సమయంలోనైనా విడుదల చేసే సైక్లోన్‌ డేమేజ్‌ రిపేర్స్‌(సీడీఆర్‌) నిధులు కూడా కేటాయించలేదు.

పూర్వోదయ నిధులపైనే ఆశలు..

పూర్వోదయ గ్రాంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు రూ.2,500కోట్లు కేటాయించనుందని ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ నిధుల కోసం చూస్తున్నామని, అవి వస్తే మైనర్‌ ఇరిగేషన్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేయవచ్చునని అన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ కింద చెరువులు, వాగులు, గెడ్డలు బాగుపడాలంటే మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈఈ రంగనాయకులును వివరణ కోరగా.. ‘2018 నీరు-చెట్టు పనులు తరువాత మైనర్‌ ఇరిగేషన్‌కు నిధులు కేటాయింపు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్వోదయ గ్రాంట్‌ వస్తే మైనర్‌ ఇరిగేషన్‌కు పూర్వ వైభవం వస్తుంది. ఆ దిశగా రూ.37కోట్లతో ప్రతిపాదనలు చేశాం.’ అని అన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:34 AM