Share News

ఉపాధి కరువై.. బతుకు బరువై!

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:05 AM

Tough times for coconut workers ఉద్దానంలో కొబ్బరి పంట... ప్రకృతి విపత్తులు, చీడపీడలతో ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇది కొబ్బరికాయల వ్యాపారంతోపాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది కొబ్బరి కార్మికులకు ఉపాధి కరువవుతోంది.

ఉపాధి కరువై.. బతుకు బరువై!
కంచిలిలో కొబ్బరి పుల్లలను ఎగుమతికి సిద్ధం చేస్తున్న కార్మికులు

  • కొబ్బరి కార్మికులకు కష్టకాలం

  • పనులు లేక రోడ్డున పడుతున్న వైనం

  • కంచిలిలో కనుమరుగవుతున్న కొబ్బరి పుల్లల వ్యాపారం

  • కంచిలి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కొబ్బరి పంట... ప్రకృతి విపత్తులు, చీడపీడలతో ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇది కొబ్బరికాయల వ్యాపారంతోపాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది కొబ్బరి కార్మికులకు ఉపాధి కరువవుతోంది. ప్రధానంగా కంచిలి మండల కేంద్రంలో కొబ్బరి పుల్లల వ్యాపారం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఫలితంగా కొబ్బరి పుల్లలపై ఆధారపడి జీవించే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్దానం కొబ్బరికి దేశంలోని వివిధ రాష్ర్టాల్లో మంచి డిమాండ్‌ ఉంది. కొబ్బరి పీచు, కొబ్బరి పుల్లల వ్యాపారం సైతం అదే స్థాయిలో పేరు సంపాదించింది. ఉద్దానం కొబ్బరి పంటకు అత్యధిక మార్కెట్‌ కల్పించిన ప్రాంతంగా కంచిలి ప్రసిద్ధి చెందింది. కొబ్బరి కాయలను ఈ ప్రాంతం నుంచి బయటి రాష్ర్టాలకు ఎగుమతులు చేయడం వల్ల వందలాది బడ్డీలు కార్మికులతో కళకళలాడేవి. ఒలుపు కార్మికులకు చేతినిండా పని దొరికేది. కొబ్బరి పుల్లల వ్యాపారం స్థానిక మహిళలు, వృద్ధులకు అదనపు ఆదాయాన్నిచ్చేది. ఇక్కడ తయారు చేసే కొబ్బరి పుల్లలను చీపుర్లుగా కట్టి.. వివిధ రాష్ర్టాలకు నిత్యం పదుల సంఖ్యల లారీలతో ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం నెలకు ఒకటి, రెండు లారీల సరుకు పంపించడమే కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు 30 నుంచి 40 కొబ్బరి పుల్లల బడ్డీలు ఉన్న కంచిలిలో ప్రస్తుతం 4 నుంచి ఐదు మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  • ఇండోనేషియా ప్రభావం

  • తితలీ తుఫాన్‌ తరువాత ఉద్దానం కొబ్బరి పంట తీరని నష్టాలకు గురైంది. చీడ పీడల కారణంగా కొబ్బరి కాయల పరిమాణం తగ్గడమే కాకుండా చెట్లపై కూడా విష ప్రభావాన్ని చూపింది. కొమ్మలు(కమ్మలు) పచ్చదనాన్ని కోల్పోయి.. పుల్లల్లో నాణ్యత లోపిస్తోంది. ఇది కంచిలిలోని కొబ్బరి పుల్లల వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గోరుచుట్టుపై రోకటి పోటులా కంచిలి కొబ్బరి పుల్లల వ్యాపారంపై ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతున్న కొబ్బరి కాయలు, పుల్లల ప్రభావం పడింది. దీంతో పూర్తిగా ఇక్కడి మార్కెట్‌ దెబ్బతింది. ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతున్న కొబ్బరిపుల్లలు నాణ్యతతోపాటు తక్కువ ధర పలుకుతుండటంతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంచిలి మార్కెట్‌ పూర్తిగా మసకబారింది.

  • ధర ఉన్నా... నాణ్యత లేమి

  • ఉద్దానంలో లభించే కొబ్బరి పుల్లలకు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉన్నా... పుల్లల్లో నాణ్యత లోపించడం వల్ల వ్యాపారుల నుంచి ఆదరణ లభించడం లేదు. గతంలో పచ్చి కొబ్బరి పుల్లలు కిలో రూ.10 నుంచి రూ.15కు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రూ.52 నుంచి రూ.55కు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఎండిన కొబ్బరి పుల్లలైతే కిలో రూ.33 నుంచి రూ.35కు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి పుల్లలు నాణ్యతతోపాటు ఎగుమతులకు సిద్ధం చేసే స్థాయిలో ఉండకపోవడంతో గిరాకీ తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. ఈ క్రమంలో కంచిలి మార్కెట్‌లో కొబ్బరి పుల్లల బడ్డీలు మూతపడటమే కాకుండా... అమ్మకాలు లేకపోవడంతో ఇళ్ల వద్ద కొబ్బరి పుల్లలు తీసే మహిళా కార్మికులు, వృద్ధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మధ్య, చిన్న కుటుంబాలు జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వలసపోతున్నారు.

  • ఉపాధితో అనుసంధానం చేయాలని...

  • ప్రస్తుతం కొబ్బరి తోటల్లో కందకాల తవ్వకాలకు సంబంధించిన పనులను ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయడంతో పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. తోటల్లో కొబ్బరి కొమ్మలు కోయడం.. పుల్లలు సేకరించడం.. వాటిని ఎగుమతులకు సిద్ధం చేయడం వంటి పనులు చాలా కష్టంతో కూడుకున్నవి. వేతనం సరిగా లేక ఈ పనులకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటువంటి పనులకు సైతం ఉపాధి పథకంతో అనుసంధానం చేస్తే రైతులకు మేలుతో పాటు కొబ్బరి కార్మికులకు ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • కూలి గిట్టుబాటు కావడం లేదు

  • రోజంతా కొబ్బరి బడ్డీల్లో పని చేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 నుంచి 20 కిలోల పుల్లలను మాత్రమే సిద్ధం చేయగలుగుతున్నాం. ఏ పనులూ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోంది.

  • - లచ్చమ్మ, కూలీ, పద్మతుల

  • ఇండోనేషియా దిగుమతులు ఎక్కువ

  • గతంలో కంచిలి మార్కెట్‌ నుంచి ఎగుమతి చేసే కొబ్బరి కాయలకు... కొబ్బరి పుల్లలకు ఎంతో డిమాండ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఇండోనేషియా నుంచి వస్తున్న కొబ్బరి పుల్లలకు ఇతర రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ కూలీ ఖర్చులు అధికంగా ఉండటమే కాకుండా... పుల్లల్లో నాణ్యత లోపించడం మార్కెట్‌ నష్టాలకు కారణమవుతోంది. 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు నిర్వహణ చాలా కష్టంగా ఉంది.

  • - సంజయ్‌ కుమార్‌ శర్మ (టిల్లు), కొబ్బరి వ్యాపారి, కంచిలి

  • ఉపాధితో అనుసంధానం చేస్తే మేలు

  • కొబ్బరి పంట అభివృద్ధికి సాయం చేస్తున్న ప్రభుత్వం.. దీని అనుబంధ వస్తువుల సేకరణకు కూడా ఉపాధి పథకాన్ని వర్తింపజేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొబ్బరి కొమ్మలు సేకరించడం... పుల్లలు సిద్ధం చేసే పనులకు ఉపాధి పథకాన్ని వర్తింపజేయాలి.

  • - రాకేష్‌ అత్‌ఘర్‌, కొబ్బరి వ్యాపారి, కంచిలి

Updated Date - Apr 15 , 2026 | 12:05 AM