ఎండతో విలవిల
ABN , Publish Date - May 10 , 2026 | 12:32 AM
Lack of shade and water at work భగభగ మండే ఎండల ప్రభావంతో ఉపాధిహామీ కూలీలు విలవిల్లాడిపోతున్నారు. పనులు చేసేచోట నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ తగిలితే తక్షణమే కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి కూలీలకు కానరాని వసతులు
పని చేసే చోట నీడ, నీరు కరువు
కానరాని ప్రథమచికిత్స కిట్లు
పాతపట్నం రూరల్, మే 9(ఆంధ్రజ్యోతి): భగభగ మండే ఎండల ప్రభావంతో ఉపాధిహామీ కూలీలు విలవిల్లాడిపోతున్నారు. పనులు చేసేచోట నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ తగిలితే తక్షణమే కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,31,457 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉపాధిహామీ వేతనదారులు 7,21,957 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎండల ప్రభావంతో చాలామంది పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో శనివారం 1,67,542 మంది వేతనదారులు మాత్రమే పనులకు వెళ్లారు. పాతపట్నం మండలంలో సుమారు 3,900 మంది వేతనదారులు చెరువుల్లో పూడికతీత, కాలువల శుభద్ర, మట్టి పనులు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5-30 నుంచి 10గంటల వరకు మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. కాగా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కనీస మౌలిక వసులు లేక వేతనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఎండ వేడికి ఉపాధి కూలీలు చెమటలు కక్కుతున్నారు. కాసేపు సేద తీరుదామన్నా నీడ లేదు. సమీపంలో చెట్లు ఉంటే కొంత పరవాలేదు. లేదంటే అంతే. జిల్లాలో చాలాచోట్ల ఉపాధిహామీ వేతనదారులు పనిచేసే చోట టెంట్‌లు కానీని, మెడికల్ కిట్‌లు గాని అందుబాటులో లేవు. దీంతో కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేక అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లోని హెల్త్‌వెల్‌నెస్ కేంద్రాల్లో మెడికల్ కిట్‌లు ఉన్నా కూలీలకు అందుబాటులో ఉంచడం లేదు. ఓఆర్‌ఎస్, ఐయోడిన్, పారాసెట్మాల్ మాత్రలు, దూది వంటివి సంబంధిత సబ్ సెంటర్ నుంచి తీసుకువెళ్లాలి. ఆ విధంగా క్షేత్రసహాయకులు చేయడంలేదు. గతంలో పనిచేసిన చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచేవారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కూలీలకు వడదెబ్బ తగిలినా.... గునపాం, పార కళ్లకు తగిలి గాయాలైనా ప్రథమ చికిత్స అందించే పరిస్థితి లేదని వేతనదారులు వాపోతున్నారు. అధికారులు స్పంందించి పని స్థలాల్లో తాగునీరు, విశ్రాంతి షెడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
అందని వేసవి అలవెన్స్‌లు
ఉపాధిహామీ పథకంలో వేసవి కాలంలో పనిచేసే కూలీలకు గతంలో వేసవి అలవెన్స్‌లు ఉండేవి. మొత్తం కూలీకి వచ్చే వేతనంలో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్ నెలలో 30శాతం అదనంగా అలవెన్స్‌లు ఇచ్చేవారు. అవాస ప్రాంతాలకు ఐదు కిలోమీటర్లు అవతల పనులు చేస్తుంటే కూలి మొత్తానికి 10 శాతం ప్రయాణ అలవెన్స్‌లు ఇచ్చేవారు. ప్రస్తుతం అలవెన్స్‌లు కూడా లేవని వేతనదారులు పేర్కొంటున్నారు.
నీడ లేదు :
పనులు చేసిన ప్రదేశంలో నీడ లేక ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. గతంలో టార్పాలిన్లు వేసి నీడ కల్పించే వారు. ఇప్పుడు మాత్రం నీడలేక అవస్థలు పడుతున్నాం.
- తాడేల యామిని, ఉపాధి హామీ వేతనదారు
నీడ కల్పిస్తే మంచిది :
పనులు చేసే ప్రదేశంలో నీడ కల్పిస్తే మంచిది. ఎండలకి పడిపోతాం అనే భయమేస్తుంది. పనులు చేయకపోతే బతుకు నడవదు.
- పెద్దింటి సరోజిని, ఉపాధి హామీ వేతనదారు
వసతులు కల్పిస్తున్నాం
ప్రతిరోజు పనులను పరిశీలిస్తున్నాం. వేతనదారులు ఎండలో ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తాం. పనిచేసే చోట మౌలిక వసతులతో పాటు ఫస్ట్‌ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
- సురేష్, ఏపీవో, పాతపట్నం