లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:00 AM
Rally protesting the central government's attitude కార్మికులను బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని వామపక్ష సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. అఖిలభారత సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక, రైతు, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
వామపక్ష సంఘాల నాయకుల డిమాండ్
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీ
అరసవల్లి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): కార్మికులను బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని వామపక్ష సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. అఖిలభారత సమ్మెలో భాగంగా గురువారం సీఐటీయూ, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక, రైతు, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డైమండ్ పార్కు నుంచి ఏడురోడ్లజంక్షన్ వరకు డప్పుల వాయిద్యాలతో, ఎర్రజెండాలు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష సంఘాల నాయకులు మాట్లాడుతూ ‘దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిన కేంద్రప్రభుత్వ చర్య అత్యంత దుర్మార్గం. కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ కొత్త చట్టాలు తెచ్చారు. సెలవులు, పనిగంటలు, ఓవర్ టైమ్, వారాంతపు సెలవులు, జాతీయ పండుగలు, పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య సౌకర్యాలు అమలు కాకుండా నిలిపివేసే అధికారం ఈ లేబర్ కోడ్లు ద్వారా లభిస్తుంది. కార్మికుల, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. శ్రమదోపిడీకి పాల్పడే ఇటువంటి చర్యలను సహించేది లేదు. లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాల’ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టి.తిరుపతిరావు, ఇఫ్టూ నాయకులు ఎస్.కృష్ణవేణి, రైతు సంఘ నాయకులు పి.చంద్రరావు, తాండ్ర ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్, పెన్షనర్ల, ఎల్‌ఐసీ, పోస్టల్, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల యూనియన్ల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.