Share News

రేపటి నుంచి కొత్తమ్మతల్లి జాతర

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:20 AM

Kottamma Thalli Jatara భక్తుల పాలిట కల్పవల్లి.. కోర్కెలు తీర్చే కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రస్థాయి పండుగగా.. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పూర్తిచేశారు.

రేపటి నుంచి కొత్తమ్మతల్లి జాతర
ఉత్సవాలకు ముస్తాబయిన కొత్తమ్మతల్లి

  • మూడురోజులపాటు ఉత్సవాలు

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

  • కోటబొమ్మాళి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): భక్తుల పాలిట కల్పవల్లి.. కోర్కెలు తీర్చే కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రస్థాయి పండుగగా.. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పూర్తిచేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు చేతులమీదుగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో రాధాకృష్ణ తెలిపారు. ఉత్సవాలకు ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్ర నలుమూలలు నుంచి ఒడిశా నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.

  • వందేళ్ల నుంచీ..

  • 1925 సంవత్సరంలో కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. ఏటా ఈ ఉత్సవాలు మహాలయ అమావాస్య మరుసటి మంగళవారం నుంచి ప్రారంభించి.. గురువారం నాడు ముగిస్తారు. అప్పట్లో కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చిన్నప్పలనాయుడురెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు అమ్మవారిని కొలిచేవారు. క్రమేపీ గ్రామస్థులు, జిల్లావాసులు, ఉత్తరాంధ్ర, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. కొత్తపేట జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి పెద్దచెరువు వరకు సమారు మూడు కిలోమీటర్లు పొడవునా, గ్రామ పురవీధుల్లో విద్యుత్‌ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదంతో భోజన సౌకర్యం కల్పించనున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 50వేల మంది భక్తులతో 30రకాల సాంస్కృతిక కళాకారులతో ఆట పాటలతో కొత్తపేట జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి పురుషులు, మహిళలతో కబడ్డీ పోటీలతోపాటు ఉత్తరాంధ్రలో ప్రావీణ్యం పొందిన సంగిడీ రాళ్లు, ఈడుపురాయి, ఉలవల బస్తాలు పోటీలు మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. పగటివేషాలు, కొయ్యి డ్యాన్సులు కూడా ఏర్టాటు చేశారు. మంగళ, బుధవారాల్లో రాత్రి 10 గంటలకు బుల్లితెర కళాకారులతో ఈవెంట్‌లు ప్రదర్శించనున్నారు. గురువారం రాత్రి శ్రీరామాంజనేయ యుద్ధం, గ యోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శిస్తారు. భక్తుల కోసం అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

  • భారీ బందోబస్తు

  • ఉత్సవాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు సిద్ధం చేశారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 800 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామమంతా సీసీ కెమెరాలు, డ్రోన్‌ల నిఘాలో ఉంటుందని ఎస్‌ఐ వి.సత్యన్నారాయణ తెలిపారు. ఏవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే 9440795835, 08942 238633 నెంబర్లుకు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ సూచించారు.

Updated Date - Oct 12 , 2026 | 12:20 AM