Share News

కొత్తమ్మ సంబరం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:06 AM

A grand Celebration in Kotabommali భక్తుల పాలిట కల్పవల్లి.. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి 101వ జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్ర్తాలు, సారె సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.

కొత్తమ్మ సంబరం
కొత్తమ్మతల్లికి పట్టువస్ర్తాలు, సారె సమర్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళిలో ఘనంగా జాతర

పట్టువస్ర్తాలు సమర్పించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

కోటబొమ్మాళి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): భక్తుల పాలిట కల్పవల్లి.. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి 101వ జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్ర్తాలు, సారె సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఐదు అడుగుల అగరబత్తిలు మూడు సిద్ధం చేశారు. వాటిని కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెలిగించారు. ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొత్తమ్మతల్లీ.. కరుణించవమ్మా అని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.సత్యన్నారాయణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆకట్టుకున్న సంగిడీ, ఈడుపురాయి పోటీలు

కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లాపరిషత్‌ బాలుర పాఠశాల అవరణలో నిర్వహించిన సంగిడీ, ఈడుపురాయి పోటీలు ఆకట్టుకున్నాయి. ఒప్పంగి గ్రామానికి చెందిన గేదేల సత్యనారాయణ సంగిడీ పోటీలో ప్రథమ బహుమతి సాధించారు. ఈడుపురాయి పోటీలో నిమ్మాడ గ్రామానికి చెందిన ఆవాల గోవిందరావు ప్రథమ స్థానం, సంగిడీ పోటీలో ద్వితీయ స్థానం సాధించారు. న్యాయనిర్ణీతులుగా టీడీపీ సీనియర్‌ నాయకులు బోయిన రమేష్‌, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, శివకుమార్‌రెడ్డి వ్యవహరించారు.

కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవోలు కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓఎస్‌డీ కింజరాపు ప్రభాకర్‌, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజులు, ఈవో రాధాకృష్ణ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోరాడ చిన్నగోవింద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బగాది శేషగిరి, పురోహితులు గణపతిశర్మ, లక్ష్మీకాంతం శర్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:06 AM