కొత్తమ్మా.. కరుణించవమ్మా
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:44 AM
Celebrations in Kotabommali కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం ఉత్సవాలు ప్రారంభం కాగా.. గురువారం అత్యంత వైభవంగా ముగిశాయి. జాతరకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.
కోటబొమ్మాళిలో అంబరాన్ని తాకిన సంబరాలు
జాతరకు పోటెత్తిన భక్తులు
కోటబొమ్మాళి, అక్టోబరు 15 (ఆంఽధ్రజ్యోతి): కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మతల్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం ఉత్సవాలు ప్రారంభం కాగా.. గురువారం అత్యంత వైభవంగా ముగిశాయి. జాతరకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. గురువారం వేకువజాము నుంచే ఆలయంలో బారులుదీరి కొత్తమ్మతల్లిని దర్శించుకున్నారు. కొత్తమ్మా.. కరుణించవమ్మా అంటూ అమ్మవారికి చీరలు, ముర్రాటలు సమర్పించారు. మహిళలు కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి చల్లదనం చేశారు. కొత్తపేట జంక్షన్ నుంచి కోటబొమ్మాళి వరకు రెండువైపులా రెండు కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ కనిపించింది. పగటి వేషాలు, కొయ్యి డ్యాన్సుల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. హెలి టూరిజం, శోభాయాత్ర, విద్యుత్ దీపాలంకరణలు, నృత్యప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పలువురు స్వచ్ఛందంగా భక్తులకు మంచినీరు పాక్కెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. సత్యసాయి సేవాసమితి సభ్యులు ఆలయ ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతర ప్రత్యేకాధికారి ఎం.కృష్ణమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ కష్టాలు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా నడుమ జాతరను పర్యవేక్షించారు.
భక్తులకు అన్నదానం
స్థానిక ఇండియన్ బ్యాంకు ఎదురుగా, పాతపోస్టాఫీసు పక్కన గురువారం భక్తులకు అన్నదానం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కాసేపు భక్తులకు భోజనాన్ని వడ్డించారు. ఆయనతోపాటు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, టీడీపీ నేతలు బోయిన గోవిందరాజులు, రమేష్ పాల్గొన్నారు.