తొలిసారిగా..
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:24 AM
Kidney transplant treatment at Palasa Hospital today సోంపేట మండలానికి చెందిన 27 ఏళ్ల హేమశ్రీకి శుక్రవారం ఉదయం కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్య బృందం నిర్ణయించింది. ఆమెకు తండ్రి మోహనరావు ఒక కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన కిడ్నీ హేమశ్రీకి సరిపోతుంది. కిడ్నీ ఆపరేషన్ జిల్లాలో మొదటిసారిగా చేస్తున్నారు.
నేడు పలాస ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స
ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ బృందం ఆధ్వర్యంలో మొదటి ఆపరేషన్
ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యబృందం
పలాస, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సోంపేట మండలానికి చెందిన 27 ఏళ్ల హేమశ్రీకి కొద్ది నెలల కిందట కాళ్లపై వాపులు కనిపించాయి. సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సీకేడీ పరీక్షలు చేయించుకోగా కిడ్నీలు పాడయినట్లు గుర్తించారు. డయాలసిస్ చేయడం తప్ప గత్యంతరం లేదని వైద్యాధికారులు చెప్పారు. దీంతో ఆమె ఇంటిలో విషాదం నెలకొంది. చాలీచాలని కూలీతో ఆమె కుటుంబం బతుకుతోంది. భర్త చిన్నచిన్న విద్యుత్ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీలు మార్పిడి చేయాలంటే కష్టమే. ఈ నేపథ్యంలో వారు పలాస కిడ్నీ ఆసుపత్రిని సంప్రదించారు. అప్పటికే తగు ఆదేశాలతో కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఎదురుచూస్తున్న వైద్య సిబ్బందికి హేమశ్రీకి ఎలాగైనా సాధారణ ఆరోగ్యస్థితిని ప్రసాదించాలని భావించారు. ఆమెకు కిడ్నీ మార్పిడి చర్యల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, కలెక్టర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను సంప్రదించారు. వారంతా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు హేమశ్రీకి శుక్రవారం ఉదయం కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్య బృందం నిర్ణయించింది. ఆమెకు తండ్రి మోహనరావు ఒక కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన కిడ్నీ హేమశ్రీకి సరిపోతుంది. కిడ్నీ ఆపరేషన్ జిల్లాలో మొదటిసారిగా చేస్తున్నారు.
ఉద్దానం గ్రామాలకు పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య కిడ్నీ వ్యాధినుంచి ప్రజలను రక్షించడానికి పలాసలో ఏకంగా 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థాపించి ఉచితంగా డయాలసిస్ అందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభించిన రెండేళ్లలోనే 24వేలకు పైగా కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కిడ్ని ఆపరేషన్ కూడా చేయడానికి సంకల్పించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. హేమశ్రీ ఆపరేషన్ విజయవంతగా పూర్తయితే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినట్లే. దీనికి అనుగుణంగా డాక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆపరేషన్‌లో పాల్గొంటుంది. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్టులు, సర్జన్లు ఉచితంగా సేవలు అందించనున్నారు. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఆపరేషన్ మైలురాయిగా నిలుస్తుంది. ఇంకా మరికొన్ని ఆపరేషన్లు నిరాకంటంగా చేయడానికి వైద్యబృందానికి అవకాశం లభిస్తుంది.
ముఖ్యమంత్రి దూరదృష్టికి ఇది నిదర్శనం:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టికి పలాస కిడ్నీ ఆసుపత్రి, ప్రస్తుతం జరగబోయే ఆపరేషన్ నిదర్శనం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యల పరిష్కారానికి బీజం వేసిందే చంద్రబాబునాయుడు. 2018 తితలీ తుఫాను సమయంలో పలాసలో మకాం వేసి 12రోజుల పాటు ఇక్కడ పాలన చక్కదిద్దారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం కోసం పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు తక్షణ అవసరంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పలాస, పాలకొండ, శ్రీకాకుళం, హరిపురం, కవిటి, ఇచ్ఛాపురం సీహెచ్‌సీల్లో నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో కిడ్నీ డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించి ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. విశాఖపట్నం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ఇక్కడే రూ.లక్షల విలువైన డయాలసిస్ ఇవ్వడం ప్రజల మరిచిపోలేనిది. ప్రస్తుతం డయాలసిస్‌తో పాటు కిడ్నీ మార్పిడి చికిత్సలకు శ్రీకారం చుట్టడం చిన్నవిషయం కాదు. దీనికి సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, జిల్లా స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌లకు ఉద్దానం ప్రజల తరుపున ధన్యవాదాలు.
- గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
కిడ్నీ ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించాం. జిల్లా చరిత్రలో మొదటి ఆపరేషన్ ఇది. దీన్ని విజయవంతం చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. మొత్తం ఆపరేషన్ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తగు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి కిడ్ని రోగికి పూర్తి వైద్యం అందించి వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడమే ఈ ఆపరేషన్ ఉద్దేశం.
- డాక్టర్ కిషోర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి