Share News

కిడ్నీవ్యాధి చంపేస్తోంది

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:11 AM

Kidney disease in Chinnakedari టెక్కలి మండలం చిన్నకేదారి గ్రామస్థులను కిడ్నీవ్యాధి వణికిస్తోంది. ఈ గ్రామంలో 48 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పోడు వ్యవసాయం చేస్తూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. గతేడాది నుంచి గ్రామంలో కిడ్నీవ్యాధి ప్రబలుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

కిడ్నీవ్యాధి చంపేస్తోంది
చిన్నకేదారి గిరిజన గ్రామం

  • చిన్నకేదారిలో అధికంగా బాధితులు

  • కారణాలు తెలియక గిరిజనుల ఆందోళన

  • ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

  • అధికారులు స్పందించాలని విన్నపం

  • టెక్కలి రూరల్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి):

  • టెక్కలి మండలం మొఖలింగాపురం పంచాయతీ చిన్నకేదారి గ్రామానికి చెందిన మాసింగి గౌరమ్మకి రెండు నెలల కిందట కిడ్నీవ్యాధి ప్రబలింది. ఆమెకు స్టేజ్‌-4లో కిడ్నీవ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌లో డయాలసిస్‌ చేయించుకునేది. అయినా ఫలితం లేక ఇటీవల మృతి చెందిందని భర్త ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.

  • ............

  • టెక్కలి మండలం చిన్నకేదారి గ్రామస్థులను కిడ్నీవ్యాధి వణికిస్తోంది. ఈ గ్రామంలో 48 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పోడు వ్యవసాయం చేస్తూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. గతేడాది నుంచి గ్రామంలో కిడ్నీవ్యాధి ప్రబలుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఐదు మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. మాత్రలు వాడుతున్నారు. డయాలసిస్‌ చేయించుకుంటే చనిపోతామనే అపోహతో కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు పొందేందుకు వెనుకంజ వేస్తున్నారు. మాత్రలతోనే నెట్టుకొస్తున్నారు. కిడ్నీవ్యాధి తీవ్రత పెరిగినప్పుడు రక్తపరీక్షలు చేయించుకున్నా.. ఫలితం లేకపోతోంది.

  • కారణమేంటో..

  • చిన్నకేదారిలో కిడ్నీవ్యాధి వ్యాప్తి కారణాలేమిటో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్థులు గతంలో బావుల్లో నీటిని తాగేవారు. ప్రస్తుతం బోరు నీటిని వినియోగిస్తున్నారు. రక్షితనీటి పథకం ద్వారా కుళాయినీటిని తాగుతున్నారు. కాగా టెక్కలి మండలం పాలసింగిలో కూడా కిడ్నీ బాధితులు అధికంగా ఉండడంతో ఇటీవల వైద్యులు పరీక్షలు చేశారు. కొంతమంది ఆర్‌ఎంపీలు నొప్పి నివారణ మాత్రలు అధికంగా ఇవ్వడం వల్ల కిడ్నీవ్యాధి ప్రబలుతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి తమ గ్రామంలో కూడా కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని చిన్నకేదారి గిరిజనులు కోరుతున్నారు.

  • ఏడేళ్లలో 104 మంది మృతి

  • గిరిజన గ్రామాల్లో చాపకింద నీరులా కిడ్నీ వ్యాధి వ్యాపిస్తోంది. గత ఏడేళ్లలో టెక్కలి మండలంలోనే 104 మంది కిడ్నీ బాధితులు మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సోమనాధపురం, పిట్టలసరియా, టెక్కలి, తోలుపురపల్లి, తిర్లంగి, భూరంగాం, శాసనాం, సరియాపల్లి తదితర గ్రామాల్లో కిడ్నీవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మండలంలో 27 మంది బాధితులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.

  • వ్యాధి తీవ్రతను తగ్గించాలి

  • మా పంచాయతీలోని పాలసింగి, చిన్నకేదారి గ్రామాల్లో రోజురోజుకూ కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. ఆర్‌ఎంపీలు మోతాదుకు మించి నొప్పి నివారణ మాత్రలు ఇస్తుండడంతో కిడ్నీ వ్యాధి ప్రబలుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్న దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు కూడా స్పందించి వ్యాధి తీవ్రతను తగ్గించేలా చర్యలు చేపట్టాలి. రెండు గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.

    - గుజ్జరు సత్యనారాయణ, మొఖలింగాపురం

  • డయాలసిస్‌ అంటే భయం

  • కిడ్నీవ్యాధి సోకడంతో కొన్నాళ్లుగా మందులు వాడుతున్నాను. డయాలసిస్‌ చేయించుకున్నవారు ప్రాణాలు కోల్పోతున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే డయాలసిస్‌ అంటే భయమేస్తోంది. అధికారులు స్పందించి కిడ్నీవ్యాధిని నివారించాలి.

    - పి.కర్రన్న, కిడ్నీ బాధితుడు, చిన్నకేదారి

  • చర్యలు తీసుకుంటున్నాం

  • ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న కిడ్నీ కేసులన్నీ పాతవే. కొత్తగా ఎక్కడా నమోదు కాలేదు. గిరిజన గ్రామాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం. కిడ్నీవ్యాధి నివారణపై చర్యలు తీసుకుంటున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం.

  • - మేరీకేథరిన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, టెక్కలి

Updated Date - Jan 21 , 2026 | 12:11 AM