కబళించిన కిడ్నీవ్యాధి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:27 AM
Two deaths in two days ఉద్దానం ప్రాంతవాసులను కిడ్నీవ్యాధి వెంటాడుతూనే ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో తరచూ ఏదోఒక గ్రామంలో ఎవరో ఒకరు కిడ్నీవ్యాధితో మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది.
రెండు రోజుల్లో ఇద్దరి మృతి
బాతుపురం పంచాయతీలో విషాదం
వజ్రపుకొత్తూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతవాసులను కిడ్నీవ్యాధి వెంటాడుతూనే ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో తరచూ ఏదోఒక గ్రామంలో ఎవరో ఒకరు కిడ్నీవ్యాధితో మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం పంచాయతీ బాతుపురం, పెదవంక గ్రామాల్లో కిడ్నీవ్యాధి బారిన పడి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ నెల 3న పెదవంక గ్రామానికి చెందిన ఇరోతు దమయంతి(53) కిడ్నీవ్యాధితో మృతిచెందారు. ఈమె ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. ఐదేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. భర్త లోకనాథం కూడా ఎనిమిదేళ్ల కిందట కిడ్నీవ్యాధితో మృతి చెందారు. తాజాగా దమయంతి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
ప్రక్కగ్రామమైన బాతుపురానికి చెందిన బత్తిని జానకిరావు(56) ఆదివారం రాత్రి కిడ్నీవ్యాధితో మృతిచెందారు. ఈయన ఏడాదిగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయామని భార్య తులసమ్మ, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. కాగా నెలరోజుల కిందట బాతపురానికి చెందిన రొయ్య బీమారావు(62) మృతి చెందారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలో మరో ఇద్దరు మృతి చెందడంతో బాతుపురం పంచాయతీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాల్లో మరో 20 మంది వరకూ కిడ్నీ బాధితులు ఉన్నారు. అధికారులు స్పందించి కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.