Share News

కిడ్నాప్‌ చేసి.. చావబాది

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:13 AM

చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు యువకులు పలాస రైల్వేశాఖలో పనిచేస్తున్న ఓ లోకోపైలెట్‌ను కిడ్నాప్‌ చేసి చావబాదారు.

కిడ్నాప్‌ చేసి.. చావబాది
వివరాలు వివరిస్తున్న డీఎస్పీ రమణ

- లోకోపైలెట్‌ను బంధించిన ఇద్దరు యువకులు

- రూ.88,500 నగదు అపహరణ

- దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వైనం

- ఆస్పత్రికి తరలిస్తుండగా తప్పించుకున్న బాధితుడు

- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుల అరెస్టు

పలాస, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు యువకులు పలాస రైల్వేశాఖలో పనిచేస్తున్న ఓ లోకోపైలెట్‌ను కిడ్నాప్‌ చేసి చావబాదారు. ఆయన సెల్‌ఫోన్‌ నుంచి ఫోన్‌పే ద్వారా రూ.88,500 నగదును తమ ఖాతాకు బదిలీ చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరిచారు. డీఎస్పీ జీవీ రమణ వివరాల మేరకు.. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ నర్సిపురం కాలనీలో నివాసం ఉంటున్న లోకోపైలెట్‌ పొందర భువనేశ్వరరావు ఈ నెల 11న తన స్వగ్రామం బూరగాం వెళ్లాడు. అదే రోజు బైక్‌పై తిరిగి నర్సిపురం కాలనీకి వస్తుండగా జాతీయ రహదారి రామకృష్ణపురం గ్రామం వద్ద పలాస పురుషోత్తపురం కాలనీకి చెందిన కర్రి సాయికృష్ణ, కొత్తూరు గ్రామానికి చెందిన గొర్లె రవితేజ అనే ఇద్దరు యువకులు ఆటోపై ఎదురుగా వెళ్లి భువనేశ్వర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. దీంతో భువనేశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఆ యువకులను ప్రశ్నించడంతో బైక్‌తో పాటు ఆయన్ను ఆటోలోకి ఎక్కించి కిడ్నాప్‌ చేశారు. పురుషోత్తపురం కాలనీలోని సాయికృష్ణ నివాసంలో భువనేశ్వర్‌ను బంధించి చావబాదారు. అంతటితో ఆగకుండా ఆయన సెల్‌ఫోన్‌లో ఉన్న ఫోన్‌ పే ద్వారా రూ.88,500 నగదును వారి ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. విడిచిపెట్టమని భువనేశ్వర్‌ ప్రాఽధేయపడినా వినకుండా మళ్లీ దాడి చేశారు. కనీసం ఆసుపత్రికైనా తరలించాలని వేడుకోవడంతో ఈ నెల 12న ఆయన్ను తీసుకొని ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న ఓ వైన్‌షాపు వద్ద ఆటోను నిలుపుదల చేశారు. అదే అదనుగా భువనేశ్వర్‌ ఆటో నుంచి బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. బుధవారం ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కిడ్నాప్‌, బెదిరింపులు, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు కిడ్నాప్‌కు వినియోగించిన ఆటో, బాధితుడి ద్విచక్రవాహనం, రూ.18500 నగదు, మూడు స్మార్ట్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసవుతున్న ఇలాంటి యువకుల్లో సత్ప్రవర్తన వచ్చే విధంగా తల్లిదండ్రులు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని అన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:13 AM