కాటేసిన వంశధార కాలువ
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:24 AM
హిరమండలంలోని చిన్నకోరాడ వీధి సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువలో ఆదివారం ఒక యువకుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు.
స్నానానికి దిగి.. యువకుడి మృతి
హిరమండలం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): హిరమండలంలోని చిన్నకోరాడ వీధి సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువలో ఆదివారం ఒక యువకుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నకోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) వంశధార కుడికాలువ వంతెన వద్ద స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. పొలం పనులు చేసుకొని వచ్చి... మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కాలువలో స్నానానికి దిగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు చూస్తుండగానే కాలు జారి కాలువలో మునిగిపోయాడు. సమీపంలో ఉన్న వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. స్థానికులు వెంటనే హిరమండలం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంశధార అధికారులకు నీటి విడుదలను నిలిపి వేయాలని కోరారు. దీంతో కాలువ గేట్లు మూసివేశారు. కొంత సమయం తరువాత నీరు తగ్గడంతో స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది కాలువలో గాలించగా... మునిగిపోయిన చోటనే మృతదేహం లభ్యమైంది. వంతెన వద్ద గుర్రపుడెక్క, తుప్పలు ఉండటంతో మృతదేహం అక్కడే ఉండిపోయింది. గతంలో కూడా ఇదే ప్రదేశంలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగి పలువురు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
అందివచ్చిన కొడుకు దూరమై...
చేతికి అందివచ్చిన కొడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు అప్పలనర్సమ్మ, దుర్గారావులు దీనంగా విలపిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా ... వివాహమైంది. గోవింద వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.