అండగా ఉంటాడనుకుంటే...
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:00 AM
తమ బిడ్డ కుటుంబానికి తోడుగా ఉంటాడని ఆశ పడిన తల్లిదండ్రులను విధి చిన్నచూపు చూసింది.
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కోటబొమ్మాళి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తమ బిడ్డ కుటుంబానికి తోడుగా ఉంటాడని ఆశ పడిన తల్లిదండ్రులను విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుమారుడిని మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై పొడుగుపాడు గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిర్లంగి గ్రామానికి చెందిన ఆవాల రాంబాబు (25) మృతి చెందాడు. పోలీసుల కఽథనం మేరకు వివరాలివీ... రాంబాబు తన స్వగ్రామం బిర్లంగి నుంచి పొడుగుపాడు వైపు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా.. టెక్కలి నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని... అదుపుతప్పి డివైడర్పై కి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెల కాపరిగా పని చేస్తున్న రాంబాబుకు తండ్రి భూషణరావు, తల్లి పారమ్మ, వివాహిత అక్క హారతిలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ఠం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. తమకు అండగా నిలుస్తాడని ఆశించిన కుమారుడి మృతితో ఆ తల్లిదండుల రోదనలు మిన్నంటుతున్నాయి. రాంబాబు మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.