Share News

సంతకాలు చేసి.. వెళ్లిపోవడమే!

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:05 AM

Doctors missing from government hospitals పలాస ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది వైద్యులు ఆస్పత్రికి సమయానికి వచ్చినా సంతకాలు చేసేసి.. వెంటనే.. తాము నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. సోమవారం ఉదయం పలాస కమ్యూనిటీ ఆస్పత్రిని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ విషయాలు వెలుగుచూశాయి.

సంతకాలు చేసి.. వెళ్లిపోవడమే!
పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల హాజరుపట్టీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కానరాని వైద్యులు

ప్రైవేటు సేవలపైనే దృష్టి

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం

పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక

పలాస, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పలాస ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది వైద్యులు ఆస్పత్రికి సమయానికి వచ్చినా సంతకాలు చేసేసి.. వెంటనే.. తాము నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. సోమవారం ఉదయం పలాస కమ్యూనిటీ ఆస్పత్రిని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆమె వచ్చిన సమయానికి ఇద్దరు వైద్యులు తప్ప ఎవరూ అందుబాటులో లేరు. ఓపీ ఎక్కువగా ఉన్నా.. రోగులను పట్టించుకునేవారు లేరు. రిజిస్టర్‌ పరిశీలించగా.. వైద్యులు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయినట్టు గుర్తించారు. దీంతో వైద్యుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గరుడఖండి వద్ద ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు ఉపాధ్యాయులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు లేరని, వైద్యసేవల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా వైద్యులను ఎమ్మెల్యే శిరీష ప్రశ్నించారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు ఆసుపత్రికి క్షతగాత్రులుగా వస్తే 8 గంటల వరకూ వైద్యం ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ విధానం సరికాదన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

రోగులకు వైద్యం అందించాల్సిందే

‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు సక్రమంగా అందించాలని, అత్యవసర సమయంలో కూడా వైద్యులు అందుబాటులో ఉండాల్సిందేన’ని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మితో కలిసి వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో సక్రమంగా వైద్యసేవలు అందడం లేదని ఫిర్యాదులు రావడం శోచనీయమన్నారు. ఇకపై ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, వైద్యసేవలపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ టి.పాపినాయుడు, వైద్యాధికారులు, ఏఎంసి చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు సవర రాంబాబు, దడియాల నర్సింహులు, గురిటి సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:05 AM