Share News

బిల్లులు చెల్లించట్లే!

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:25 AM

ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు.

 బిల్లులు చెల్లించట్లే!
ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

- 75 రోజులుగా నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు

- రూ.18కోట్లు పెండింగ్‌

- కొత్త పనులపై వేతనదారుల అనాసక్తి

టెక్కలి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు. మొత్తం రూ.18కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో 915 గ్రామపంచాయతీల పరిధిలో ఈ ఏడాది జనవరి 12 నుంచి ఇప్పటివరకు పలు గ్రామాల్లో చెరువులు, కాలువలు, ఉద్యానవన తోటల్లో ట్రెంచ్‌లు తదితర పనులు చేపట్టారు. మొత్తం 1,326 పనులకు సంబంధించి రూ.18కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. కానీ, ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో వారంతా బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వేతనాలు రాకపోవడంతో కొత్త పనులపై అనాసక్తి చూపుతున్నారు. ఏప్రిల్‌ నాటికి లక్షా78వేల మంది వేతనదారులు వివిధ పనుల్లో పాల్గొనాల్సిన ఉండగా, 94,524 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గ్రామాల్లో పనులకు వెళ్లాలని ఫీల్డ్‌అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో కోరుతున్నా ఆ ఉత్సాహం వేతనదారుల్లో కనిపించడం లేదు. జిల్లాలో వేతనదారుల సంఖ్య పెరగాలన్నా, ఉపాధి హామీ పనులు వేగవంతంగా జరగాలన్నా బిల్లులు చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయమై డ్వామా పీడీ లవరాజును వివరణ కోరగా.. ‘ఈ ఏడాది జనవరి 12 వరకు వేతనదారులకు బిల్లులు చెల్లించాం. తరువాత చేపట్టిన పనులకు సుమారు రూ.18కోట్లు బకాయిలు ఉన్నాయి. వేతనదారుల సంఖ్య పెంచేందుకు ఈ వేసవిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’అని తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 12:25 AM