Share News

మాతృమూర్తుల్లో ఆనందం

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:14 AM

‘Thalliki Vandanam’ funds to be credited starting today సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం అమలుకు వేళ అయింది. ఏటాలాగే ఈ ఏడాది కూడా ఈ పథకం కింద విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నిధులను జమ చేయనుంది.

మాతృమూర్తుల్లో ఆనందం

  • నేటి నుంచి ‘తల్లికి వందనం’ నిధులు జమ

  • పాఠశాలల వారీగా సచివాలయాల్లో జాబితా విడుదల

  • జిల్లాలో 3.12 లక్షల మందికి లబ్ది

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం అమలుకు వేళ అయింది. ఏటాలాగే ఈ ఏడాది కూడా ఈ పథకం కింద విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నిధులను జమ చేయనుంది. బుధవారం నుంచి విడతల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. గతేడాది జిల్లాలో 2.90 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజురు చేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 3.12 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కుటుంబంలో చదువుకొనే పిల్లలందరికీ ఈపథకం వర్తిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు కాగా.. ఇందులో పాఠశాల నిర్వహణకు రెండు వేలు మినహాయించి తల్లుల ఖాతాలో రూ.13వేలు జమచేయనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూలు, కాలేజీ విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది.

  • జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 3037 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,85,465 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇంటర్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు సుమారు 40వేల మందిఉన్నారు. వీరంతా తల్లికి వందనం పథకానికి అర్హులే. ఈ నెల 22 నుంచి అర్హుల తుదిజాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదలును ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. ఆగస్టు 4 నుంచి 10వరకు అదనపు అర్హుల జాబితా రూపకల్పన చేస్తారు.

  • ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల అదనపు అర్హుల జాబితాలో ఆమోదించిన ఫిర్యాదుల వివరాలు, ప్రచురణ, ఆర్థిక సాయం పంపిణీ ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది.

  • ఆర్టీఈ ప్రవేశాలకు ఫీజుల మినహాయింపు

  • విద్యాహక్కు చట్టం కింద ఈఏడాది 256 ప్రైవేటు పాఠశాలల్లో జిల్లాలో 1,084 మంది విద్యార్థులు ఉచితంగా ప్రవేశం పొందారు. ఈ విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన పాఠశాల ఫీజును ఈ పథకంలో ఇచ్చే మొత్తం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఫీజులు కింద మినహాయించిన మొత్తాలను సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయం ద్వారా పాఠశాలలకు జమ చేస్తారు. ఇప్పటికే కేంద్ర నిధులతో ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ మొత్తాన్ని మినహాయించి చెల్లిస్తారు.

  • చెక్‌ చేసుకోండిలా..

  • ఈ పథకానికి మీరు అర్హులా.. కాదా అనేది ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఎన్‌బీఎం/బీఎం-ఎస్‌జీఎస్‌డబ్యూపోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తల్లి ఆధార్‌ నెంబర్‌ ఒటీపీ సహాయంతో కొన్ని నిమిషాల్లో ఎలిజిబులిటీ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. అర్హతపై సందేహాలుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లను సంప్రదించాలి.

  • ఇవీ అర్హతలు

  • విద్యార్థి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.లక్షా20వేలు , పట్టణాల్లో రూ.లక్షా44వేల లోపు ఉండాలి. కుటుంబానికి విధిగా రేషన్‌ కార్డు ఉండాలి. పది ఎకరాల లోపు మాత్రమే భూమి కలిగి ఉండాలి. బియ్యంకార్డులో ఉన్నవారి పేరిట నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. విద్యార్థి వార్షిక హాజరు 75శాతానికి తగ్గకూడదు. ఆ కుటుంబం విద్యుత్‌ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.

  • తల్లి బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ లింకై ఉండాలి. బ్యాంక్‌ ఖాతా ఈకేవైసీపూర్తి చేయాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ యాక్టివ్‌గా ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల రికార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు సరిగా నమోదై ఉండాలి.

Updated Date - Jul 22 , 2026 | 12:14 AM