Share News

కూటమి మద్దతుదారుల్లో జోష్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:55 AM

First Phase of Panchayat Polls జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పలాస రెవెన్యూ డివిజన్‌ పరిఽధి ఏడు మండలా ల్లోని పంచాయతీ పోరులో 66.93 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సర్పంచ్‌ స్థానాలు కూటమి మద్దతుదారులు దక్కించుకోవడంతో వారిలో జోష్‌ కనిపించింది.

కూటమి మద్దతుదారుల్లో జోష్‌

తొలివిడత పంచాయతీ పోరులో అధిక స్థానాలు కైవసం

శ్రీకాకుళం/ కవిటి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పలాస రెవెన్యూ డివిజన్‌ పరిఽధి ఏడు మండలా ల్లోని పంచాయతీ పోరులో 66.93 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సర్పంచ్‌ స్థానాలు కూటమి మద్దతుదారులు దక్కించుకోవడంతో వారిలో జోష్‌ కనిపించింది. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 173 పంచాయతీల్లో 3,61,420 ఓటర్లు ఉండగా.. 2,41,899 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇచ్ఛాపురం 62.04 శాతం, పలాస 73.48 శాతం, మందస 71.87 శాతం, కంచిలి 69.93 శాతం, వజ్రపుకొత్తూరు 65.66 శాతం, కవిటి 66.06 శాతం, సోంపేట 62.45 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ఆరంభమైంది. అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 194 స్థానాలకుగానూ.. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో 21 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 173 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ మద్దతుదారులు 116 పంచాయతీల్లో (21చోట్ల ఏకగ్రీవంతో కలిపి) సర్పంచ్‌లుగా గెలుపొందారు. జనసేన మద్దతుదారులు 8 మంది విజయం సాధించారు. మొత్తం కూటమికి 124 స్థానాలు దక్కాయి. వైసీపీ మద్దతుదారులు 56 మంది, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నలుగురు విజయం సాధించారు. గురువారం రాత్రి సమయానికి ఇంకా పది పంచాయల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.

లండారిపుట్టుగలో ఇరువర్గాల రాళ్లదాడి

కవిటి మండలం లండారిపుట్టుగలో పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పర రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వైసీపీ మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ మద్దతుదారులు ఆరోపించడంతో గొడవ ప్రారంభమైంది. ఆపై రాళ్లదాడికి దారితీసింది. పోలింగ్‌ కేంద్రం పక్కనే ఉన్న రోడ్డుపై రాళ్లతో ఇరుపక్షాలు దాడులు చేసుకున్నాయి. ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ నర్తు రామారావు గన్‌మెన్‌ దామోధరరెడ్డికి తలపై రాయి తగిలి గాయమైంది. అలాగే టీడీపీ మద్దతుదారుడు ఎన్‌.కేశయ్యకు తలపై తీవ్రగాయం కాగా.. మరో ఇద్దరికి చేతులపై గాయాలయ్యాయి. ఇరువర్గాలు గుంపులుగా ఏర్పడి దాడులకు సిద్ధంకాగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలింగ్‌ ముగిసే అరగంట ముందు ఈ ఘటన జరగడంతో ఓటర్లు భయాందోళన చెందారు. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆపై ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి.. ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

Updated Date - Nov 27 , 2026 | 12:55 AM