Share News

కూటమిలో జోష్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:25 AM

'Local' election heat begins in Srikakulam త్వరలో స్థానిక సంస్థల సమరం మెదలు కానుండటంతో జిల్లా రాజకీయాలు రాజుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేసి తిరుగులేని విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. అదేఊపుతో స్థానిక సంస్థలనూ కైవసం చేసుకునేందుకు రణరంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు, మొన్నటి ఎన్నికల్లో చతికిలపడిన ప్రతిపక్ష వైసీపీకి ఈ ఎన్నికలు ప్రాణసంకటంగా మారాయి.

కూటమిలో జోష్‌

  • సిక్కోలులో మొదలైన ‘స్థానిక’ ఎన్నికల వేడి

  • పోరుకు సిద్ధమవుతున్న పార్టీల శ్రేణులు

  • కేసులు, వర్గపోరు, పరాభవాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలు

  • ఏకగ్రీవంపై జగన్‌ వార్నింగ్‌తో మాజీమంత్రులకు ముచ్చెమటలు

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): త్వరలో స్థానిక సంస్థల సమరం మెదలు కానుండటంతో జిల్లా రాజకీయాలు రాజుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేసి తిరుగులేని విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. అదేఊపుతో స్థానిక సంస్థలనూ కైవసం చేసుకునేందుకు రణరంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు, మొన్నటి ఎన్నికల్లో చతికిలపడిన ప్రతిపక్ష వైసీపీకి ఈ ఎన్నికలు ప్రాణసంకటంగా మారాయి. స్వీయ తప్పిదాలతో వరుస కేసులు, అరెస్టులు, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఆ పార్టీ నేతలకు.. ‘ఎక్కడైనా ఏకగ్రీవమైతే వచ్చే అసెంబ్లీ టికెట్‌ గల్లంతే’ అంటూ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హెచ్చరిక మరింత దడ పుట్టిస్తోంది.

  • కూటమిలో పదవుల పండుగ

  • కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు పదవులు చేపడదామా? అని మండల, గ్రామస్థాయి నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పడిన కష్టాలు, చేసిన పోరాటాలను వివరిస్తూ నాయకులు ప్రొఫైల్స్‌ సిద్ధం చేసుకుంటున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో పదవులు అనుభవించినవారు సైతం మరోసారి పాగా వేయాలని చూస్తున్నారు. ఎన్నికల వ్యూహాలకు కూటమి అధిష్ఠానాలు కూడా పదును పెడుతున్నాయి. రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలను భర్తీ చేయడంతోపాటు, జనసేన సైతం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • గతంలోనే నిలిచాం.. ఇప్పుడిక క్లీన్‌స్వీపే

  • వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసిన తీరు ప్రజలకు ఇంకా గుర్తుంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన శ్రేణులు ప్రాణాలకు తెగించి పోరాడాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకుని సత్తా చాటారు. నాడు అధికార దౌర్జన్యాలనే ఎదిరించిన వారంతా.. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండటంతో జిల్లాలోని స్థానిక సంస్థలన్నింటినీ కైవసం చేసుకుని వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు.

  • వైసీపీకి కేసులు.. అజ్ఞాతాలు..

  • కూటమి శ్రేణుల్లో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తుంటే .. వైసీపీలో మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. జిల్లాలోని కీలక నేతలంతా తీవ్ర వివాదాలు, పోలీసు కేసులతో సతమతవుతున్నారు.

  • పలాసలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఓ గొర్రెలకాపరి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్వయంగా అప్పలరాజు జైలుకు వెళ్లిరావడం పార్టీ క్యాడర్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.

  • ఆమదాలవలసలో మాజీ స్పీకర్‌ తమ్మిమనేని సీతారాం, ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు చిరంజీవి నాగ్‌ ఓ భూ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, పోలీసుల అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి కోర్టు నుంచి బెయిల్‌ పొందినప్పటికీ, ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాభవం కాస్త పరాభవంగా మారిపోయింది. తమ్మినేని విషయమై కనీస మద్దతుగా వైసీపీ అధినేత జగన్‌ నోరు మెదపలేదు.

  • ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ సైతం కేసుల పాలై అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదంతా పాజిటివ్‌గానే ఎన్నికల్లో సహకరిస్తుందన్న గంపెడాశతో నాయకులు ఉన్నారు. కానీ ఈ పరిణామాలు.. ద్వితీయస్థాయి నాయకులు, కార్యకర్తలు.. పార్టీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టాయి.

  • ధర్మాన వ్యాఖ్యలు.. భగ్గుమన్న వర్గపోరు

  • జిల్లా వైసీపీలో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. సీనియర్‌ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న విచిత్ర వ్యాఖ్యలు క్యాడర్‌కు పాలుపోకుండా చేస్తున్నాయి. ‘‘నేను కూడా అరెస్టయితే.. సానుభూతితో సునాయాసంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేస్తాను’’ అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ పార్టీ అంతర్గత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ‘‘ఇతర జిల్లాల వైసీపీ నాయకులు మనపై పెత్తనం చేయడమేంటి?’’ అంటూ ధర్మాన ప్రసాదరావు తనయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించడం దుమారం రేపింది. జిల్లాలో ధర్మాన సోదరుల వర్గం ఒకవైపు, విజయనగరానికి చెందిన మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వర్గం మరోవైపు చీలిపోయాయి.

  • ‘ఏకగ్రీవం’ అయితే సీటు గల్లంతే..

  • స్థానిక ఎన్నికల్లో కూటమికి ఎక్కడా చోటు ఇవ్వకూడదని, ఏ నియోజకవర్గంలోనైనా వార్డులు, పంచాయతీలు కూటమికి ఏకగ్రీవమైతే.. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు. ఈ కండిషన్‌ జిల్లా వైసీపీ మాజీమంత్రులు, నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో పోటీకి నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితిలో.. పోటీకి దింపకపోతే జగన్‌ టికెట్‌ కట్‌ చేస్తాడన్న భయం వెంటాడుతోంది. ఫలితం ఎలా ఉండబోతోందో తెలిసినా.. గత్యంతరం లేక అభ్యర్థుల ఎంపిక కసరత్తులంటూ ‘మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:25 AM