పలాసకు ఎయిర్‌పోర్టుతో ఉద్యోగాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:58 PM
ROB completed in just nine months పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణకు ప్రజలు సహకరించాలని కోరారు.
భూసేకరణకు ప్రజలు సహకరించాలి:
తొమ్మిది నెలల్లోనే ఆర్వోబీ పూర్తి
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
కాశీబుగ్గ/పలాస, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిహారం చెల్లించడంతో పాటు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. కాశీబుగ్గలో రూ.50 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.122 కోట్లతో చేపట్టనున్న పలాస-కాశీబుగ్గ తాగునీటి ప్రాజెక్టు, సుడా నిధులు రూ.5 కోట్లతో నిర్మించనున్న మురుగుకాలువల పనులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి శంకుస్థాపన చేశారు. రైతుబజారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో జిల్లా వాసులే ఎక్కువగా కనిపిస్తున్నారని, అలాంటిది పలాసలోనే ఎయిర్‌పోర్టు నిర్మిస్తే స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.
ఆర్వోబీ లేక 16 ఏళ్ల నరకయాతన
పలాసలో ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు 16 ఏళ్లుగా నరకయాతన అనుభవించారని రామ్మోహన్‌నాయుడు అన్నారు. అంబులెన్స్‌లు నిలిచిపోవడం, ఇతర కారణాలతో బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇప్పటి వరకు సుమారు 300 మంది మృతిచెందినట్లు తెలుసుకుని బాధపడ్డామని తెలిపారు. తొమ్మిది నెలల్లోనే ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి రూ.650 కోట్ల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనలను ఆమోదించారని చెప్పారు. ఒడిశా ప్రభుత్వంతో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయాయని, త్వరలోనే బ్యారేజి నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
రెండున్నరేళ్లలో 98 శాతం హామీలు అమలు: అచ్చెన్న
కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్వోబీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 16 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారి అర్హతలను పరిశీలించి అందరికీ పింఛన్లు అందించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. పలాస మున్సిపాలిటీలో రహదారుల వ్యవస్థ మెరుగుపడిందన్నారు.
మొదలు పెట్టింది మేమే.. ప్రారంభించిందీ తామే: శిరీష
పలాస నియోజకవర్గ అభివృద్ధికి గౌతు, కింజరాపు కుటుంబాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ప్రాజెక్టులు, వివిధ పథకాలను ప్రారంభించింది తామేనని, ఇప్పుడు వాటిని పూర్తి చేసి ప్రారంభించుకోవడం కూడా తమకే దక్కిందన్నారు. ఆర్వోబీకి 2017లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు తామే ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకోసం దివంగత నేతలు అప్పయ్యదొర, జగన్నాయకులతో పాటు తన తండ్రి గౌతు శ్యామసుందరశివాజీ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
మాజీ మంత్రి గౌతు శివాజి మాట్లాడుతూ పలాసలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి పథకాలు అమలవుతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పర్హాన్ అహ్మద్‌ఖాన్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్‌గుప్తా, లొడగల కామేశ్వరరావు యాదవ్, శాసనపురి మురళీకృష్ణ, గాలి కృష్ణారావు, ఎం.నరేంద్ర, జనసేన ఇన్‌చార్జి దుర్గారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, దడియాల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు యువజన టీడీపీ నాయకుడు ఎం.నరేంద్ర (చిన్ని) 200 కిలోల బరువైన గజమాలతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే గౌతు శిరీషకు స్వాగతం పలికారు.