Share News

కొలువులు.. వైద్యసేవలు

ABN , Publish Date - May 15 , 2026 | 12:26 AM

Cabinet decisions bring many benefits ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జిల్లా ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు పలు ప్రయోజనాలను చేకూర్చనుంది.

కొలువులు.. వైద్యసేవలు
మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి అచ్చెన్న తదితరులు

  • కేబినెట్‌ నిర్ణయాలతో జిల్లావాసులకు ప్రయోజనాలెన్నో

  • విద్యుత్‌ శాఖలో 135 ఏఈఈ పోస్టులు

  • జిల్లావాసుల ముంగిటకే ‘104’ డయాగ్నస్టిక్స్‌..

  • ఉచితంగా 41 రకాల పరీక్షలు

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు వెయిటేజీ

  • ఏపీఎస్‌ఎంఈఎక్స్‌తో చిన్న పరిశ్రమలకు ఆర్థిక దన్ను

  • శ్రీకాకుళం, మే 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జిల్లా ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు పలు ప్రయోజనాలను చేకూర్చనుంది. కేబినెట్‌ నిర్ణయాలు.. జిల్లా పరిధిలో ఉద్యోగావకాశాలు పెంచడంతోపాటు, సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా, చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉన్నాయి.

  • ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న జిల్లా యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏపీ పవర్‌ యుటిలిటీలలో 629 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో జిల్లాకు సంబంధించి ఏపీఈపీడీసీఎల్‌(తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ) పరిధిలో 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్‌, సివిల్‌, టెలికాం విభాగాల్లో ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనుండటంతో జిల్లాలో ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది.

  • పల్లె ముంగిటకు ‘104’ డయాగ్నస్టిక్స్‌ ప్రోగ్రామ్‌...

  • జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ‘104 డయాగ్నస్టిక్స్‌ ప్రోగ్రామ్‌’కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ పథకం కింద జిల్లాలో సంచరించే 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా ప్రజలకు ఇకపై 41 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఈ పరీక్షల రిపోర్ట్‌లన్నీ డిజిటలైజ్‌తో ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానమవుతాయి. దీంతో జిల్లావాసులు పరీక్షల కోసం సుదూర ప్రాంతాలకు, ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ (డిజటల్‌ కేర్‌ కోఆర్డినేషన్‌ హెల్త్‌కేర్‌ డెలివరీ సిస్టమ్‌) అమలుకు కేబినెట్‌ నిధులు కేటాయించింది. ఇది జిల్లాలో వైద్యసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చనుంది.

  • బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఊరట

  • రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో 1,523 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (బోధన) పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేబినెట్‌ స్పష్టం చేసింది. ఇందులో బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఏపీపీఎస్సీ రాతపరీక్షలో కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీకి వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ప్రతి సంవత్సరానికి 0.5శాతం చొప్పున గరిష్టంగా పదేళ్లకు వెయిటేజీ ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలో ఎచ్చెర్లలోని డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది.

  • చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భరోసా..

  • జిల్లాలోని జీడిపప్పు, జూట్‌, గ్రానైట్‌ తదితర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక దన్ను అందించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌ (ఏపీఎస్‌ఎంఈఎక్స్‌)ను ప్రారంభించనుంది. దీని ద్వారా ఈక్విటీ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. పెట్టుబడుల కొరతతో సతమతమవుతున్న జిల్లాలోని చిన్న పరిశ్రమలు విస్తరించుకోవడానికి ఇది గొప్ప వరం. అలాగే, ఎర్లీ బర్డ్‌ స్కీమ్‌ కింద పరిశ్రమల స్థాపనకు అనుమతుల (సీఎఫ్‌ఈ) గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ.. జిల్లాలో కొత్త పరిశ్రమలకు వెసులుబాటు కల్పించనుంది.

  • ఇంధన పొదుపు దిశగా...

  • ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు, సప్లై చైన్‌ సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వనరుల సంరక్షణకు ‘‘స్టేట్‌ యాక్షన్‌ ప్లాన్‌’’ను ఆమోదించింది. ఇందులో భాగంగా జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సాధారణ ప్రజలు కూడా పెట్రోల్‌, డీజిల్‌ వాడకాన్ని తగ్గించుకొని పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మేరకు పొదుపు చర్యలు తక్షణమే అమలుకానున్నాయి. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తోపాటు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:26 AM