Share News

రూ.1.20 లక్షలిస్తే విదేశాల్లో ఉద్యోగం

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:18 AM

Fraud using fake passports విదేశాల్లో ఉద్యోగం. నెలకు రూ.60వేలు సంపాదించే అవకాశం. ఇంకెందుకు ఆలస్యం. నాకు ఒక్కొక్కరు రూ.1.20 లక్షలు చెల్లిస్తే పాస్‌పోర్టుతోపాటు ఎబ్రాయడ్‌ దేశం వెళ్లడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తా’నని కోటబొమ్మాళి మండలం బలపురానికి చెందిన బ్రోకరు ముక్కు సురేష్‌ నిరుద్యోగులను నమ్మించాడు.

రూ.1.20 లక్షలిస్తే విదేశాల్లో ఉద్యోగం
బ్రోకరు అందించిన నకిలీ పత్రాలు చూపిస్తున్న బాధితులు

  • నకిలీ పాస్‌పోర్టులతో నిరుద్యోగులకు మోసం

  • కాశీబుగ్గ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

  • నిందితుడి అరెస్టు

  • పలాస, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘విదేశాల్లో ఉద్యోగం. నెలకు రూ.60వేలు సంపాదించే అవకాశం. ఇంకెందుకు ఆలస్యం. నాకు ఒక్కొక్కరు రూ.1.20 లక్షలు చెల్లిస్తే పాస్‌పోర్టుతోపాటు ఎబ్రాయడ్‌ దేశం వెళ్లడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తా’నని కోటబొమ్మాళి మండలం బలపురానికి చెందిన బ్రోకరు ముక్కు సురేష్‌ నిరుద్యోగులను నమ్మించాడు. దీంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ జయరామచంద్రపురం గ్రామానికి చెందిన బద్రి వెంకటరమణ, మర్ల రాజేష్‌, మర్ల వెంకటరావు, మర్ల జగన్నాయకులు, మల్లారపు వాసు, మార్పు రామకృష్ణ రూ.8.40 లక్షలు చెల్లించారు. ఇదేవిధంగా ఇచ్ఛాపురం మునిసిపాలిటీకి చెందిన నిరుద్యోగులు కూడా అంతకన్నా ఎక్కువ నగదు చెల్లించారు. దీంతో బ్రోకర్‌ వారిని చండీఘర్‌ తీసుకెళ్లి ఇంటర్వ్యూలు చేయించారు. తర్వాత ఉద్యోగ నియామకపత్రాలు పాస్‌పోర్టులు సైతం అందించారు. వారంతా ఇక తమకు ఉద్యోగాలు గ్యారంటీ అని సంతోషించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు ఉద్యోగ నియామకపత్రాలు పాస్‌పోర్టులతో చేరుకున్నారు. అక్కడ తనిఖీ చేసిన అధికారులు అవి నకిలీ పాస్‌పోర్టులుగా గుర్తించి వారిని వెనక్కి పంపిచేశారు. దీంతో తాము మోసపోయామని నిరుద్యోగులంతా లబోదిబోమంటున్నారు. తామంతా బ్రోకరును ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమని గదమాయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాలేదు.. కనీసం డబ్బులైనా తిరిగి ఇవ్వమని కోరినా ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. దీంతో గురువారం రాత్రి బాధితులంతా కలిసి కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ.. నిందితుడ్ని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. బ్రోకర్ల మాటలు విని నిరుద్యోగులు మోసపోవద్దని, బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తామని సీఐ తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 12:18 AM