Share News

నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:21 AM

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరేందుకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రాన్స్‌ ఎగ్జామినేషన్‌ ( జేఈఈ) మెయిన్స్‌ రెండో సెషన్‌ పరీక్షలు గురువారం నుంచి ఈనెల 9 వరకు జరగనున్నాయి.

 నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు
నరసన్నపేటలోని కోర్‌ కోరో టెక్నాలజీ

- నరసన్నపేటలో కేంద్రం ఏర్పాటు

- పరీక్షలు రాయనున్న 3 వేల మంది అభ్యర్థులు

నరసన్నపేట, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరేందుకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రాన్స్‌ ఎగ్జామినేషన్‌ ( జేఈఈ) మెయిన్స్‌ రెండో సెషన్‌ పరీక్షలు గురువారం నుంచి ఈనెల 9 వరకు జరగనున్నాయి. జిల్లాకు సంబంధించి నరసన్నపేట పట్టణంలోని కోరో టెక్నాలజీలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఈ నెల 2,4,5,6,8 తేదీల్లో రెండు షిఫ్ట్‌ల్లో పేపర్‌-1(బీఈ, బీటెక్‌) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. 9న మధ్యాహ్నం పేపర్‌-2 బీఆర్క్‌ పరీక్ష జరగనుంది. నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేసింది. ఏ పట్టణంలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారో అందులో పేర్కొంది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 9 వేల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 60శాతం మంది అభ్యర్థులు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి తదితర పట్టణాల్లో పరీక్షలు రాయనున్నారు. నరసన్నపేటలో నిర్వహించే ఈ పరీక్షలకు సుమారు 3 వేల మంది వరకు అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 21 నుంచి 29 వరకు మొదటి సెషన్స్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలంటే..

నరసన్నపేట పట్టణంలోని గొట్టిపల్లి అండర్‌ పాసైజ్‌ వంతెన పక్కనే పరీక్ష కేంద్రం కోరో టెక్నాలజీ ఉంది. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం వైపుల నుంచి వచ్చే అభ్యర్థులు నరసన్నపేట పట్టణంలోనిసీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ పక్కన ఉండే రోడ్డు ద్వారా నేరుగా జాతీయ రహదారి వద్దకు చేరుకోవాలి. అక్కడ కుడివైపున ఈ కేంద్రం కనిపిస్తుంది. జాతీయ రహదారి మీదుగా వచ్చేవారు జమ్ము జంక్షన్‌ వద్ద హైవే కిందకు దిగి సర్వీసు రోడ్డులో గొట్టిపల్లి అండర్‌ పాసైజ్‌ వంతెన దగ్గరకు చేరుకుంటే ఈ కేంద్రం కనిపిస్తుంది.

Updated Date - Apr 02 , 2026 | 12:21 AM