Share News

‘జల్‌జీవన్‌’నీరుగారె.. రూ.229 కోట్లు వెనక్కి

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:08 AM

1,322 ‘Jal Jeevan’ works cancelled జిల్లాలో గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య శాఖ(ఆర్‌డబ్ల్యూఎస్‌) పనితీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) పనులు నీరుగారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం కారణంగా వందలాది పనులు రద్దయిపోయాయి.

‘జల్‌జీవన్‌’నీరుగారె.. రూ.229 కోట్లు వెనక్కి
సైలాడలో నిరుపయోగంగా కుళాయి కనెక్షన్ల పైపులు, నందికొండలో అసంపూర్తిగా వాటర్‌ ట్యాంక్‌

  • ప్రగతి లేక 1,322 పనులు రద్దు

  • అధికారుల తీరుపై విమర్శలు

  • జిల్లాలో సగం ఇళ్లకు కూడా చేరని కుళాయిలు

  • వేసవి గడిచినా వినియోగించని అత్యవసర నిధులు

  • సచివాలయాలు, హాస్టళ్లలో నత్తనడకన మరుగుదొడ్ల నిర్మాణాలు

  • ప్రతిపాదనల్లోనే వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులు

  • ఆర్‌డబ్ల్యూఎస్‌ తాజా నివేదికలో బయటపడిన వైఫల్యాలు

  • శ్రీకాకుళం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):

  • జిల్లాలో గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య శాఖ(ఆర్‌డబ్ల్యూఎస్‌) పనితీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) పనులు నీరుగారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం కారణంగా వందలాది పనులు రద్దయిపోయాయి. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ఇచ్చిన నిధులను సైతం సకాలంలో ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో ఉన్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ తాజా ప్రగతి నివేదిక ద్వారా బట్టబయలైంది.

  • జల్‌జీవన్‌ మిషన్‌ కింద జిల్లాలో 5,608 పనులను రూ. 2,30,583 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. వీటిలో కనీసం 25శాతం మేర కూడా నిధులు ఖర్చు చేయని కారణంగా 1,322 పనులను రద్దు చేశారు. రద్దయిన ఈ పనుల అంచనా విలువ రూ.229 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం కొనసాగుతున్న 4,286 పనుల్లోనూ కేవలం 1,191 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 3,006 పనులు పురోగతి దశలోనే ఉండగా, 38 పనులకు అగ్రిమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 13 పనులు అసలు ప్రారంభానికే నోచుకోలేదు.

  • సగం ఇళ్లకు కూడా చేరని కుళాయిలు

  • జిల్లాలోని గ్రామాల్లో మొత్తం 5,35,764 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభమైన నాటి నుంచి(01-04-2020 తర్వాత) నేటి వరకు సాధించిన ప్రగతి కేవలం 44.96 శాతం మాత్రమే. జేజేఎంకు ముందున్న 2.61 శాతంతో కలుపుకొన్నా, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 47.57 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన 50 శాతానికిపైగా జనాభా.. ఇంటింటి కుళాయికి నోచుకోక తాగునీటి కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు.

  • వేసవి పనులు అసంపూర్తి

  • ఈ ఏడాది వేసవిలో తాగునీటి కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యల కింద జీవో ఆర్టీ 397 ద్వారా ప్రతి జిల్లాకు రూ.50లక్షలు విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో రూ.43.15 లక్షలతో 20 పనులకు మంజూరు చేశారు. వేసవి కాలం గడిచిపోయినా ఈ అత్యవసర పనుల్లో కేవలం ఆరు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 14 పనులు పురోగతి దశలోనే ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

  • సచివాలయాలు, హాస్టళ్లలో పడకేసిన పారిశుధ్యం

  • స్వచ్ఛభారత్‌ మిషన్‌(గ్రామీణ) కింద చేపట్టిన పారిశుధ్య పనుల పరిస్థితి క్షేత్రస్థాయిలో మరీ దారుణంగా ఉంది. సచివాలయాలకు వచ్చే ప్రజల అవసరాల కోసం 69 మరుగుదొడ్ల పనులు మంజూరు చేయగా, కేవలం 15 మాత్రమే పూర్తయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం వసతిగృహాల్లో 43 మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 18 మాత్రమే పూర్తయ్యాయి. అంగన్‌ వాడీ కేంద్రాల్లో మంజూరైన 20 మరుగుదొడ్ల పనులకుగాను ఇంకా ఆరు పనులు పురోగతి దశలోనే ఉన్నాయి.

  • గ్రిడ్‌ పనుల్లో కదలిక శూన్యం

  • శాశ్వత తాగునీటి వనరుల కోసం ప్రతిపాదించిన వాటర్‌గ్రిడ్‌ పనులు సైతం ముందుకు సాగడం లేదు. రూ.1,204 కోట్లతో టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల కోసం ఫేజ్‌-1 కింద గతేడాది జూలై 22న మంజూరైన పనులు ఇంకా ‘టెండర్ల’ దశలోనే ఉన్నాయి. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల తదితర ప్రాంతాలకు ఫేజ్‌-2 కింద రూ.1550 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇక ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద 26 పనులకు సంబంధించి రూ.3,479 లక్షల ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించి నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకపోవడంతో జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ‘జేజేఎం’పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే పనుల్లో ప్రగతి ఉండే అవకాశముందని.. జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనుల తీరుపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వీవీ ఈశ్వరరావు వద్ద ఫోన్‌లో ప్రస్తావించగా.. ప్రస్తుతం విజయవాడలో ఉన్నానని, తర్వాత వివరాలు వెల్లడిస్తానని బదులిచ్చారు.

Updated Date - Oct 05 , 2026 | 12:08 AM